పల్లాకు చెమటలు పట్టించిన ఎవరీ తీన్మార్ మల్లన్న?

By Sirisha SFirst Published Mar 20, 2021, 8:36 PM IST
Highlights

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న ఇక్కడ హోరాహోరీగా పోరాడి పల్లా  రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించాడు.మల్లన్న ఓటమి చెందినప్పటికీ...  ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఎలా ఓట్లు సాధించాడని ప్రశ్న అందరిలోను తలెత్తుతున్న ప్రశ్న. అసలు ఈ తీన్ మార్ మల్లన్న ఎవరు, ఆయనకు ఇన్ని ఓట్లు రావడానికి కారణాలేమిటనే విషయాన్ని చూద్దాము. 

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాలుగు రోజులపాటు సాగి ఎట్టకేలకు ఫలితాలు విడుదలయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొదటి ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన భారీస్థాయి ఓటింగ్  ఎంతటి తీవ్రమైన పోటీకి తెరలేపిందో మనం చూసాము. 

రెండు స్థానాల్లోనూ నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో పోరు అత్యంత ఆసక్తికరంగా సాగింది. రంగారెడ్డి - హైదరాబాద్ - మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కూడా ఇక్కడ కౌంటింగ్ కొనసాగింది. అక్కడిలా ఇక్కడ పోటీ తెరాస బీజేపీల మధ్య కాదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న ఇక్కడ హోరాహోరీగా పోరాడి పల్లా  రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించాడు.

మల్లన్న ఓటమి చెందినప్పటికీ...  ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఎలా ఓట్లు సాధించాడని ప్రశ్న అందరిలోను తలెత్తుతున్న ప్రశ్న. అసలు ఈ తీన్ మార్ మల్లన్న ఎవరు, ఆయనకు ఇన్ని ఓట్లు రావడానికి కారణాలేమిటనే విషయాన్ని చూద్దాము. 

తీన్ మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. జర్నలిస్టుగా తీన్ మార్ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేసేవాడు. అంతకు పూర్వం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో ఆ తరువాత ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసిన తరువాత వి6 లో చేరాడు. 2012లో తీన్ మార్ వార్తల ద్వారా లైం లైట్ లోకి వచ్చాడు. ఆ కార్యక్రమంలో  తెలంగాణ పెద్దమనిషిగా కంబళి చుట్టుకొని అచ్చమైన తెలంగాణ యాసలో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత నుండి తెలంగాణ ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఎత్తి చూపెట్టేవాడు. ఈ విధంగా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితుడయ్యాడు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ వి6 లో ఉద్యోగానికి  రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానినికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఆ తరువాత మరల 10 టీవీ లో ఇదే తరహా కార్యక్రమాన్ని హోస్ట్ చేసాడు. కేసీఆర్ బంధువుల చేతికి ఈ ఛానెల్ వెళ్లిన తరువాత అక్కడ రాజీనామా చేసి కొద్దీ కలం టీవీ5లో పనిచేసారు. 

మల్లన్న బాగా పాపులర్ అయ్యిందంటే మాత్రం తాను సొంతగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పాలి. ప్రతి ఉదయం వార్తలతో, వాటి విశ్లేషణలతో కేసీఆర్ సర్కారుని తూర్పారబడుతూ సమస్యల మీద నిలదీసేవాడు. ఇలా చేస్తున్న తరుణంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల సపోర్ట్ బాగా దక్కింది. ఇలా సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యాడు. 

అక్కడ పోటీచేసి ఓటమి చెందినప్పటికీ... అతని పేరు మాత్రం అందరికీ సుపరిచితమయింది. ఆ తరువాత ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి కృషి చేసాడు. విద్యార్థులు, నిరుద్యోగ యువత అతని కోసం స్వచ్చంధంగా పనిచేసారు. ఉద్యమకారుడు, తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం వంటి పాపులర్ వ్యక్తిని కూడా సునాయాసంగా వెనక్కి తోసేయగలిగాడు.

రాములు నాయక్, చెరుకు సుధాకర్ వంటి ఉద్దండులను కూడా ఖంగు తినిపించి దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించినంత పనిచేసాడు. భవిష్యత్తులో తీన్ మార్ మల్లన్న మరింతగా బలపడి సర్కార్ కి సవాల్ విసిరే స్థాయికి చేరుకునేలానే కనబడుతున్నాడు. ఇప్పటికే తాను త్వరలో గడప గడపకూ వెళతాను అని చెప్పాడు కూడా. వేచి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో..!

click me!