
లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఘటనతో సంబంధమున్న అందరిని ఐసోలేట్ చేసినప్పటికీ కూడా తెలంగాణాలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడడం, కలవడం వల్లే ఇదంతా జరుగుతుంది. సూర్యాపేటలో అష్టాచమ్మ ఆడిన మహిళ ద్వారా తెలియకుందాం ఎంతమందికి ఈ వైరస్ సోకిందో వేరుగా చెప్పనవసరం లేదు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ రాష్ట్రమంతా కూడా కరీంనగర్ ఫార్ములాను అమలు చేయాలనే యోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. కరీంనగర్ లో ఒక్కసారిగా కేసులు బయటపడ్డా... అక్కడి యంత్రాంగం ఆ కేసులను సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. అక్కడ కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి ఇప్పుడు కరీంనగర్ ని మామూలు స్థితికి తీసుకురాగలిగారు.
కరీంనగర్ లో ఏం చేసారు...?
కరీంనగర్‌లో మర్కజ్ కేసులు దాదాపు 17 నమోదయ్యాయి. యంత్రాంగం సమర్థవంతమైన పనితీరు వల్ల ఇప్పుడవి రెండుకు తగ్గాయి. మరో రెండు వారాల్లో కేసులు జీరోకు చేరుకోవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ సిబ్బంది నుండి మొదలు రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలకు చెందినవారందరూ సమన్వయంతో పనిచేసారు. అన్ని శాఖల మధ్య పూర్తి స్థాయి కోఆర్డినేషన్ కి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఎంతగానో కృషి చేసారు.
జన సంచారాన్ని పూర్తిగా కట్టడి చేసారు. ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అనవసరంగా రోడ్లమీదకు ఎవ్వర్నీ రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేయడం దగ్గరి నుండి డ్రోన్ల వరకు అన్ని విధాలుగా ప్రజల కదలికలపై ఒక కన్నేసి ఉంచడమే కాకుండా దాదాపుగా అనవసర కదలికలను నివారించగలిగారు.
ఇక ప్రజలు బయటకు రావడానికి వాహనాలను వాడుతున్నారు కాబట్టి వాహనాల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. బండ్లను అకారణంగా బయటకు తీస్తే బండ్లను సీజ్ చేయడం నుంచి మొదలు పెట్రోల్ బంకులు తెరిచి ఉంచే సమయాన్ని కూడా కుదించారు.
ఇకపోతే... వ్యాపార సముదాయాల పనివేళలను కుదించాలని వ్యాపారస్తులను కోరగా వారు స్వచ్చందంగా తమ వ్యాపార సమయాలను తగ్గించుకున్నారు. దీంతో లాక్ డౌన్ సమర్థవంతంగా అమలయింది. రాత్రి ఎలాగూ కర్ఫ్యూ ఉండడంతో రేయింబవళ్లు కరీంనగర్ లో జన సంచారాన్ని పూర్తిగా అదుపులో పెట్టడంతో కరోనా దెబ్బకు తోకముడిచింది.
ఇక ఇప్పుడు పూర్తి తెలంగాణాలో ఇదే మాదిరిగా లాక్ డౌన్ ను అమలు చేయాలనీ యోచిస్తోంది తెలంగాణ సర్కార్. సోషల్ డిస్టెంసింగ్ ను మరింత కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది.
ఇకపోతే వ్యాపార సముదాయాలను కూడా మధ్యాహ్నం 12 గంటలకల్లా మూసేయాలని ఆదేశాలను పోలీసులు సదరు యజమానులకు జారీ చేయడమే కాకుండా చాల చోట్ల ఇవి నిన్నటి నుండే అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ బంకుల సమయాలను కూడా కుదించేందుకు అధికారులు ప్రణాళికలను రచిస్తున్నట్టు తెలియవస్తుంది.
కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేస్తున్నట్టు తెలియవస్తుంది. ఆ ప్రాంతాల్లో ఇండ్ల నుంచి ఎవ్వరిని బయటకు రానీయకుండా, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను ఇంటివద్దకు పంపే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం పక్కింటివారితో కూడా మాట్లాడనీయకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు.