లాక్ డౌన్: క్రికెటర్లపై బుకీల వల, టార్గెట్ వీళ్ళే....!

By Sree SFirst Published Apr 20, 2020, 9:55 AM IST
Highlights

అంతర్జాతీయంగా ఆటకు బ్రేక్‌ పడిగా.. ఈ విరామ సమయంలో ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉంటోన్న క్రికెటర్లపై ఫిక్సింగ్‌ వల విసిరేందుకు సిద్ధమవుతున్నారు. కళంకిత అవినీతిపరులు ఆన్‌లైన్‌ వేదికగా క్రికెటర్లను సంప్రదించేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధిపతి అలెక్స్‌ మార్షల్‌ హెచ్చరించారు. 

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి విసిరిన పంజాకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ నిలిచిపోయింది. మార్చి 15 న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) లో జరిగిన మ్యాచే చివరిది, మరో మ్యాచ్‌ చోటు చేసుకోలేదు. 

గల్లీ క్రికెట్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు అన్నీ నిలిచిపోయాయి. ఆటగాళ్లందరూ తమ ఇండ్లకే పరిమితం అయ్యారు. కోవిడ్‌-19ను ఎదురించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు స్టార్‌ క్రీడాకారులు ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. 

ఎప్పటికిప్పుడు సూచనలు ఇస్తూ, కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆట నిలిచిపోయినా, ఆటలో అవినీతి నిలిచిపోదని బుకీలు నిరూపిస్తున్నారు. 

అంతర్జాతీయంగా ఆటకు బ్రేక్‌ పడిగా.. ఈ విరామ సమయంలో ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉంటోన్న క్రికెటర్లపై ఫిక్సింగ్‌ వల విసిరేందుకు సిద్ధమవుతున్నారు. కళంకిత అవినీతిపరులు ఆన్‌లైన్‌ వేదికగా క్రికెటర్లను సంప్రదించేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధిపతి అలెక్స్‌ మార్షల్‌ హెచ్చరించారు. 

ఆట లేదు కదా అని రిలాక్స్‌ అయితే, ఇదే అదనుగా క్రికెటర్లను చేరుకునేందుకు బుకీలు ముందుకొస్తారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలెక్స్‌ మార్షల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

పేరు పొందిన బుకీలు, కళంకితులు ఈ సమయాన్ని వినియోగించుకునేందుకు చూస్తున్నారుని, ఎన్నడూ లేనింతగా క్రికెటర్లు సోషల్‌ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు కాబట్టి, దీంతో అభిమానుల రూపంలో క్రికెటర్లకు దగ్గరేయ్యేందుకు పన్నాగం పన్నుతున్నారని  మార్షల్ అన్నాడు. 

ఇప్పుడు పరిచయం చేసుకొని, మెల్లిగా దాన్ని పెంచుకుంటూ వెళ్లి, ఆ తర్వాత పని చేసుకోవాలనేది వారి అంతరంగం. కోవిడ్‌-19 అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ నిలిచిపోయేలా చేసింది. కానీ బుకీలు మాత్రం ఈ వాతావరణంలోనూ క్రీయాశీలంగానే ఉన్నారు. 

ఈ పరిస్థితిపై సభ్య దేశాలకు సమాచారం అందించామని, ఆటగాళ్లలో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రాముఖ్యత తెలిపామని, ఎటువంటి అనుమానాస్పద విషయాలనైనా నివేదించేలా ఆటగాళ్లలో అవగాహన కల్పించామని ఐసీసీ ఏసీయూ చీఫ్‌ అలెక్స్‌ మార్షల్‌ అన్నారు. 

కోవిడ్‌-19పై చేస్తున్న యుద్ధంలో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు భారత క్రికెటర్లు చాలా మంది ఆన్‌లైన్‌లో క్రీయాశీలంగా కనిపిస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా ఫిక్సర్లు విసిరే వలపై ఆటగాళ్లకు అవగాహన కల్పించారు. ఏ విధంగా బుకీలు సంప్రదింపులు జరుపుతారనే కోణాలపై ఆటగాళ్లకు సవివరణ స్పష్టత ఇచ్చారు అధికారులు. 

సాధారణంగా బుకీలు ఆన్‌లైన్‌లో క్రికెటర్ల అభిమానులుగా పరిచయం చేసుకుంటారు లేదా ఇతరుల సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా క్రికెటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ పరిచయం పెంచుకుని, మ్యాచ్‌ సమయంలో ఫిక్సింగ్‌ ఆఫర్‌ ముందుకు తీసుకొస్తారు. ఇది బుకీల వర్కింగ్ స్టైల్.  

టార్గెట్ వీరే.... 

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆట ఆగిపోయింది. వరల్డ్‌ స్టార్‌ క్రికెటర్లకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండదు. బోర్డుల నుంచి భారీ మొత్తంలో వార్షిక వేతనం, వాణిజ్య ఒప్పందాల రూపంలో ఆకర్షణీయమైన సొమ్ము వారి సొంతం. 

కానీ... క్రికెట్‌ నిలిచిపోవటం వర్థమాన క్రికెటర్ల జీవితంలో మార్పులకు దోహదం చేస్తుంది. మ్యాచు ఫీజులే ప్రధాన ఆదాయ వనరుగా కలిగిన ద్వితీయ, తృతీయ శ్రేణి వర్థమాన క్రికెటర్లు కోవిడ్‌-19 సమయంలో ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నారు. 

దీంతో బుకీలు వీరినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్థికంగా సహాయం చేసి, అవసరం వచ్చినప్పుడు వాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఐసీసీ ఏసీయూ సైతం ప్రధానంగా ఈ కోణంలోనే బుకీల కదలికలను గమనించాలని సభ్య దేశాల క్రికెట్‌ బోర్డులను కోరింది. 

బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు భారత క్రికెటర్ల ఆన్‌లైన్‌ చాట్‌ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానాస్పద సంభాషణలను మార్క్‌ చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక సమావేశానికి ఆస్కారం లేదు. 

అందుకుని, భవిష్యత్‌లో సంబంధిత సంభాషణలు చేసిన సోషల్‌ మీడియా ఖాతాదారుల కదలికలను ఏసీయూ పర్యవేక్షించనుంది. ఆటగాళ్లను సైతం సందేహాస్పద సంభాషణలపై ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలని కోరింది. ఐసీసీ, బీసీసీఐలు బుకీల సంప్రదింపులపై ఎంత అవగాహన కల్పించినా.. వర్థమాన క్రీడాకారులకు ఆర్థికంగా చేయూత ఇవ్వకుంటే బుకీలు ఈ సమయంలో పైచేయి సాధించే ప్రమాదం పొంచి ఉంది!.

click me!