జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలనే కేసీఆర్ ఆలోచనకు శివసేన, డిఎంకెల వైఖరి కాస్తా అడ్డంకులు కల్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో పునరాలోచనలో పడే అవకాశాలున్నాయి.
బిజెపికి, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ స్థాపించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో శివసేన, డీఎంకె పెడుతున్న కొలికి కేసీఆర్ ను డైలమాలో పడేసినట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు లేకుండా బిజెపి వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఇదే విషయాన్ని తాము తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా చెప్పామని ఆయన అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీలో జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో నిర్వహిచాల్సిన పాత్రపై చర్చ జరిగింది. కేసీఆర్ ను సంజయ్ రౌత్ ప్రశంసిస్తూనే తమ వైఖరిని స్పష్టం చేశారు. అదే సమయంలో డీఎంకే నేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కాంగ్రెసును కూటమిలో కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా కాంగ్రెసుతోనే కూటమి కట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెసు వైఖరి ఆమెకు నచ్చలేదు. దీంతో కాంగ్రెసు లేకుండానే కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు. కేసీఆర్ మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెసు లేకుండానే కూటమి ఏర్పాటు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
undefined
కేసీఆర్ అభిప్రాయంపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెసు లేకుండా ప్రతిపక్షాల కూటమి సాధ్యం కాదని వి. హనుమంతరావు అన్నారు. కేసీఆర్ వైఖరిని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తప్పు పట్టారు. అయితే, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతూ వస్తోంది. నిజానికి, తెలంగాణలో బిజెపి కన్నా కాంగ్రెసు బలంగా ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా సాగుతోంది. ఈ స్థితిలో జాతీయ స్థాయిలో కేసీఆర్ కు కాంగ్రెసుతో నెయ్యం సాధ్యం కాదు.
దాంతో జాతీయ స్థాయి కూటమి విషయంలో కేసీఆర్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు .వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయి కూటమి ప్రయత్నాలను తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలున్నాయి.
లోకసభ ఎన్నికల కన్నా ముందు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో లోకసభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలకు కేసీఆర్ పదును పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడు అవసరమైతే కాంగ్రెసుతో దోస్తీ వల్ల ఇబ్బంది ఉండదనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఏమైనా, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
తెలంగాణ శానససభ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. ఆ తర్వాత 2024లో లోకసభ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత లభించే సమయంలో జాతీయ కూటమి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కేసీఆర్ ముమ్మరం చేయనున్నారు.