ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామం ఏపీలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామం ఏపీలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది. అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు స్వరూపానందేంద్ర ఆధ్యాత్మిక విషయాలలో అనధికారిక సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. అధ్యాత్మిక విషయాల్లో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఆయన సలహాలు తీసుకునేవారనేది బహిరంగ రహస్యమే.
అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విషయానికి వస్తే.. స్వరూపానందేంద్రతో ఆయనకు మంచి సత్సబంధాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పలువురు ఆయనకు సాకారం అందించారు. అందులో స్వామి స్వరూపానందేంద్ర కూడా ఒక్కరు. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై స్వరూపానందేంద్ర విమర్శలు వర్షం కురిపించారు. పలు విషయాల్లో చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
undefined
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2016లో ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో కొన్ని పూజలు నిర్వహించారు. ఈ పూజలు అన్ని స్వరూపానందేంద్ర సమక్షంలోనే జరిగాయి. అప్పటి నుంచి జగన్, స్వరూపానందేంద్రల మధ్య సంబంధాలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత కూడా జగన్ కోసం స్వరూపానందేంద్ర కొన్ని పూజలు చేశారు. విజయవాడలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని ఆలయాలను కూల్చివేయాలని ఆదేశించినందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్వరూపానందేంద్ర తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక మతానికి చెందిన కొంత శాతం ఓటర్లను టీడీపీకి దూరం చేయడంలో స్వరూపానందేంద్ర పాత్ర పోషించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.
సీఎం జగన్ కూడా స్వరూపానందేంద్రపై ఎంతో నమ్మకం ఉంచారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొద్ది రోజులకే సీఎం జగన్.. విశాఖ శారద పీఠంకు వెళ్లి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్‌కు ఆత్మీయంగా ముద్దులు ఇచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా సీఎం జగన్ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. ఇక, స్వామి స్వరూపానందేంద్రకు అనుకూలంగా వైసీపీ సర్కార్, టీటీడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు కూడా తరుచూ విశాఖ శారదపీఠం సందర్శించడం, స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకోవడంతో.. ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేవారు.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా సీఎం జగన్‌కు, స్వరూపానందేంద్రకు మధ్య కొంత దూరం పెరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అందువల్లే ఇటీవలి కాలంలో విశాఖ శారద పీఠం వైపు చూడటం లేదనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఇటీవల కర్ణాటకలోని మైసూరుకు చెందిన విజయ కుమార్ స్వామి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి వివిధ రకాల ప్రచాలు జరగగా.. వైఎస్ జగన్ బంధువు, టీటీడీ చైర్మన్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం అందించారని తెలిపారు. తాను ఎంతో మంది స్వామిజీలను తీసుకొచ్చి జగన్‌కు ఆశీర్వాదాలు ఇప్పిస్తుంటానని కూడా చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించకున్నాయి. హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్న సమయంలో స్పందించిన స్వరూపానందేంద్ర ఆ ఘటనలు ఖండించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని తాను సీఎంతో మాట్లాడతానని కూడా అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు చేయడంతో.. ఏపీలో ఏం జరుగుతుందనే చర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు స్వరూపానందేంద్ర ఇలాంటి కామెంట్స్ చేయడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అప్పన్న చందనోత్సం ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి..
అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ సంవత్సరం అంతా చెత్తగా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైంది. భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగారు. ఈ సంవత్సరం అధికారులు గానీ, ఎవరు గానీ మమల్ని అడగలేదు. పోలీసుల ఇష్టారాజ్యం అయిపోయింది. భక్తులకు చేరువగా భగవంతుడు ఉండే పరిస్థితి లేదు. ఆరు నెలల కంటే పైగా ఇక్కడ ఈవో లేకపోవడం దారుణం. ఇంత పెద్ద క్షేత్రాన్ని ఒక్క ఇంచార్జ్‌తో నడపడం ఏమిటి?
భక్తుల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. గర్భాలయంలో ఏ మాత్రం ఆచారం, సంప్రదాయం లేకుండా అయిపోయింది. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పొచ్చు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూస్తే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. అసలు ఈరోజు నేను ఎందుకు దర్శనానికి వచ్చానా? అని అనిపించింది. కొండ కింది నుంచి పైవరకు భక్తుల రద్దీ ఉన్న ఎలాంటి మూమెంట్ లేదు. వీఐపీల దర్శనమేమిటి? ఇక్కడ ఉంది పేదల దేవుడు.. ధనవంతులు దేవుడు కాదు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించింది’’ అని స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.