బిజెపి పుదుచ్చేరి హామీ: జగన్, చంద్రబాబులకు అస్త్రం, తిరుపతిపై ఎఫెక్ట్

By telugu team  |  First Published Apr 1, 2021, 11:55 AM IST

పుదుచ్చేరికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా బిజెపి తేనెతుట్టెను కుగిపినట్లే ఉంది. ఆ హామీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తిరుపతిలో బిజెపిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.


అమరావతి: పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి బిజెపి చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. జాతీయ స్థాయి మాట అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా తిరుపతి ఉప ఎన్నికలో బిజెపిని ఇరకాటంలో పెట్టినట్లయింది. ఇక ముందు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

అంతేకాకుండా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బిజెపి అస్త్రాన్ని అందించినట్లయింది. తిరుపతి లోకసభ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బిజెపి అనాలోచితమైన హామీ ఇవ్వడం బిజెపికి ఎదురుదెబ్బనే అవుతుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీకి ఇవ్వడం సాధ్యం కాని ప్రత్యేక హోదా పుదుచ్చేరికి ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ఇదే సమయంలో తిరుపతి ఉప ఎన్నిక కోసమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదాను ప్రధాన ఎజెండాగా చేసుకునే అవకాశం ఉంది. బిజెపిపైనే కాకుండా వైసీపీపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

పుదుచ్చేరి ఎన్నికల్లో కూడా బిజెపికి ఆ హామీ అంత పనికి రాకపోవచ్చు. నీతీ అయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెబుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అలాంటి సమయంలో పుదుచ్చేరికి ఎలా ఇస్తారని అడిగే అవకాశం ఉంది. ఒక రకంగా బిజెపి పుదుచ్చేరికి హామీ ఇవ్వడం ద్వారా మరోసారి తేనెతుట్టెను కదిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా బీహార్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను తిరిగి ఎజెండా మీదికి తీసుకుని వచ్చే అవకాశం ఉంది.

click me!