నాడైనా నేడైనా తెలంగాణ ప్రజల ప్రాణాలు తృణప్రాయమేనా?

By telugu teamFirst Published Oct 13, 2019, 6:05 PM IST
Highlights

ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చేవరకు ప్రజలు ప్రాణత్యాగాలు చేశారంటే ప్రజలు తమ ఆకాంక్షలను ప్రకటించడానికి, తమ గుండె చప్పుడును వినిపించడానికి. ఈ అస్థిత్వ పోరాటం కోసం ఇలాంటి విపరీత చర్యలకు దిగారు.

నాటి నియంత నిజాం ప్రభుత్వ కాలం నుంచి నేటి ప్రజాస్వామిక ప్రభుత్వం వరకు తెలంగాణాలో నిరంకుశత్వం  రాజ్యమేలుతుందా అనే అనుమానం కలుగక మానదు. తెలంగాణాలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం నుంచి మొదలు, తెలంగాణ తొలి దశ ఉద్యమం మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకొనేవరకు తెలంగాణ ప్రజలు అసువులు బాసారు. 

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు అసువులు బాసారంటే, అస్తిత్వ ప్రకటన కోసం. ప్రాణాలను బలితీసుకోవడం గర్హనీయమైన విషయం. కాకపోతే ఉద్యమ సమయంలో నిస్సహాయమైన స్థితిలో ఇలా ఆత్మబలిదానాలకు ఒడిగట్టారు తెలంగాణ ప్రజలు. అప్పుటి ఉమ్మడి ప్రభుత్వం ఈ బలిదానాలను గడ్డిపరకలతో సమానంగా చూసారు. 

ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చేవరకు ప్రజలు ప్రాణత్యాగాలు చేశారంటే ప్రజలు తమ ఆకాంక్షలను ప్రకటించడానికి, తమ గుండె చప్పుడును వినిపించడానికి. ఈ అస్థిత్వ పోరాటం కోసం ఇలాంటి విపరీత చర్యలకు దిగారు.

ఆంధ్ర వలసవాదుల గుత్తాధిపత్యం వల్ల వివక్షకు గురయ్యి ఇలాంటి విపరీత చర్యలకు దిగేవారు. తెలంగాణ వచ్చిన తరువాత ఇటువంటి విపరీత చర్యలు ఆగిపోతాయని ఇకమీదట తెలంగాణాలో బలిదానం అనే పదం వినపడదు అని భావించారంతా. 

కానీ, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకునేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో మనస్థాపానికి గురైన డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా రాపర్తినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. సుమారు 90 శాతం కాలిపోయాడు. 

90శాతం కాలిన గాయాలతో, ఆసుపత్రిలో చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతూ అసువులుబాసాడు.  ఈ డ్రైవర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తమ బ్రతుకులు మారతాయని బలంగా నమ్మాడు. సకలజనుల సమ్మె అప్పుడు ఆర్టీసీ ప్రగతి చక్రాన్ని ఆపితే తమ బ్రతుకులు ప్రగతిపథంలో పయనిస్తాయని  నమ్మి తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కాడు. ఆనాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న కెసిఆర్ మాటలను విశ్వసించి తన ఉద్యోగాన్ని సైతం పణంగా పెట్టి స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటాడు. 

తెలంగాణ వచ్చింది, తమ సంస్థ ప్రభుత్వంలో విలీనమవుతుందని ఎదురు చూసాడు. కానీ అది సాకారమవ్వలేదు. పైపెచ్చు తన ఉద్యోగానికే ఎసరొచ్చింది. ఉద్యోగాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే పణంగా పెట్టి పోరాడిన వాడికి ఇది ఒక లెక్క కాదు. కాకపోతే, తాము తెచ్చుకున్న ఉద్యమ తెలంగాణలో తమ ఆకాంక్షలు నెరవేరకపోగా, తాము గెలిపించి తెచ్చుకున్న ప్రభుత్వమే తమను ఇలా మోసం చేస్తూంటే, చూసి తట్టుకోలేకపోయిన వైనంగా మనకు కనపడుతుంది. 

శ్రీనివాస్ రెడ్డిది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం కాదు. ఇద్దరు కుమారులూ మంచి హోదాలో ఉన్నారు. ఇద్దరు కుమారులు కూడా దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఒకరు ఆర్మీలో పనిచేస్తుండగా, మరొకరు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. వీటన్నింటిని బట్టి చూస్తుంటే శ్రీనివాస్ రెడ్డి మరణానికి ఉద్యోగం పోతుందనే భయం కన్నా నమ్మక ద్రోహం వల్ల కలిగిన బాధే ఎక్కువగా కనపడుతుంది. 

ఆనాడు మలి తెలంగాణ ఉద్యమమప్పుడు శ్రీకాంతాచారి ఎల్బి నగర్ చౌరాస్తాలో ఇలానే నిప్పంటించుకున్నాడు. అమరుడయ్యాడు. నేడు శ్రీనివాస్ రెడ్డి ఇలానే నిప్పంటించుకున్నాడు. అశువులుబాశాడు. తెలంగాణ వచ్చిన తరువాత ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగట్టిన, ఒడిగట్టాలనే ప్రయత్నం చేసిన చివరి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డే కావాలని ఆశిద్దాము.   

click me!