ఆర్టీసీ సమ్మె: మారిన కెసిఆర్ మైండ్ సెట్ వల్లే సమ్మె ఉధృతమైందా?

By telugu teamFirst Published Oct 13, 2019, 2:38 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు ఆరున్నర గంటలపాటు కాబినెట్ భేటీని నిర్వహించారు కెసిఆర్. ఈ భేటీ అనంతరం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను మరింత రగిలిపోయేలా చేస్తున్నాయి. 

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తున్న విషయం తెలిసిందే.    

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరణించాడు. 

ఆర్టీసీ సమ్మె అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు ఆరున్నర గంటలపాటు కాబినెట్ భేటీని నిర్వహించారు కెసిఆర్. ఈ భేటీ అనంతరం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను మరింత రగిలిపోయేలా చేస్తున్నాయి. 

సమ్మెకు దూరంగా ఉన్నవారికి మాత్రమే జీతాలిస్తాననడం నుంచి మొదలు ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు అనడం వరకు కెసిఆర్ వ్యాఖ్యలు కార్మికులను మరింత కోపోద్రిక్తులను చేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరాశకులోనై, ఏమీ చేయలేని నిస్సహాయుడైన  శ్రీనివాస్ రెడ్డి వంటి వ్యక్తి  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

ఆర్టీసీ ఆసుపత్రిలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు వైద్యం ఆపేయాలని ఆర్టీసీ ఆసుపత్రి వర్గాలకు మౌఖిక ఆదేశాలందాయనే వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కార్మికులు మరింతగా తిరగబడే ప్రమాదం ఉంది. ఆర్టీసీ ఆసుపత్రి వర్గాలు దీనికి ససేమిరా అనడంతో ఆ వివాదం సద్దుమణిగింది. 

స్వభావరీత్యా కెసిఆర్ మాటలు దూకుడుగా ఉన్నా మనసు మాత్రం సున్నితంగానే మనకు కనిపిస్తుంది. భావోద్వేగానికి కెసిఆర్ చాల తొందరగా లోనవుతారు. సమస్యలతోని త్వరగా కనెక్ట్ అవుతారు. ఆపదలో ఉన్నవారికి వెంటనే సహాయం చేస్తారు.సవతి తల్లి చేత చిత్ర హింసలకు గురైన బాలిక కథనాన్ని మీడియాలో చూసి చలించి ఆ అమ్మాయిని తన కూతురులాగా చూసుకోనున్నట్టు ప్రకటించాడు కెసిఆర్. 

ఇలాంటి కెసిఆర్ ఇప్పుడెందుకో కాస్త వాస్తవిక పరిస్థితులను, గ్రౌండ్ లెవెల్ రియాలిటీలను అంతగా అర్థం చేసుకుంటున్నట్టు లేదు.మొండితనం ప్రదర్శించినప్పటికీ, విషయం చేజారిపోయే ప్రమాదం ఉందని గ్రహిస్తే మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మసలుకునేవారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది కెసిఆర్ తీరు. కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్  గా మారిందేమో లేదా చుట్టూ ఉన్న వందిమాగధుల పుణ్యమో కానీ కెసిఆర్ మైండ్ సెట్ లో మార్పు కనిపిస్తుంది.  

ఎలెక్టోరల్ అథారిటేరియనిజం (ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడం వల్ల ప్రజల మద్దతు తనకు పూర్తిగా ఉందని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఆమోదిస్తారనే భావన) వల్ల కాబోలు కెసిఆర్ లో విశ్వాసం ఎక్కువయ్యింది. సినిమాలో డైలాగ్ మాదిరిగా నేను ఒక్క సారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కెసిఆర్. 

ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మెను కెసిఆర్ మరి పర్సనల్ గా తీసుకుంటున్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక సమయం. ప్రతిపక్షం ఓట్లు చీలడం ద్వారా కెసిఆర్ కు లాభం కలుగుతుంది నిజమే. కానీ తెరాస కు ఓట్లు వేసే వారి సంఖ్యా కూడా మరింతగా తగ్గే ఆస్కారం కూడా లేకపోలేదు. హుజూర్ నగర్ లో డిపో లేదు, కానీ ఉద్యోగులు ఎక్కడైనా ఉంటారు. వారు గనుక అక్కడకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటే అధికారపక్షానికి తిప్పలు తప్పకపోవచ్చు. 

తెరాస లోని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ సమ్మె విషయంలో కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరుకు విస్మయానికి గురయ్యింది. బయటకు చెప్పట్లేదుకని  ఈ ఆర్టీసీ సమ్మె పుణ్యమాని నూతన నాయకత్వం పుడుతుందేమో అని లోలోన మదన పడుతున్నారు. 

సాధ్యమైనంత త్వరగా ఈ సమ్మెకు కెసిఆర్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాజకీయంగా అధికార తెరాస కు నష్టం కలిగే ప్రమాదం ఉంది. 

click me!