రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పిలుపు: పార్టీని వీడినవారంతా వస్తారా?

By Pratap Reddy Kasula  |  First Published May 18, 2023, 5:22 PM IST

కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులకు వ్యూహాత్మకంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు.


కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడినవారికి, ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకులకు వ్యూహాత్మక పిలుపు ఇచ్చారు. తమ పార్టీలోకి రావాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, రాజేందర్ రెడ్డి మాత్రమే కాకుండా ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ అవసరమని, తెలంగాణ అభ్యున్నతిని కోరుకునేవారు తమ పార్టీలోకి రావాలని ఆయన అన్నారు. 

పార్టీలోకి రావడానికి ఇష్టపడేవారి కోసం తాను ఓ మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీకి తాను నాయకుడిని కానని ఆయన చెప్పారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ నాయకులని, పార్టీలో చేరాలని అనుకునేవారు నేరుగా వారితో మాట్లాడుకోవచ్చునని, తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే సీనియర్లతో మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీని వీడి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కాంగ్రెస్ నేతలు సంప్రదిస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని వారు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజోగాల్ రెడ్డి కూడా ధ్రువీకరించారు. అయితే, తాను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పనిచేయబోనని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కూడా రేవంత్ రెడ్డి ఆ పిలుపు ఇచ్చారని అనుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ఖర్గేతోనో, సోనియా గాంధీతోనో మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్లుగా భావించారు. 

ఇదిలావుంటే, పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు బిఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. వారు బిజెపిలో చేరవచ్చుననే ప్రచారం జరిగింది. అయితే, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆంతరంగికులు వారిద్దరితో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణ కాంగ్రెస్ కు ఊపునిచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై తన శక్తిని ఉపయోగించే అవకాశాలున్నాయి.  కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 136 సీట్లను గెలుచుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఏకమయ్యారు. విభేదాలు విస్మరించి పనిచేయాలనే తలంపుతో వారున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. 

click me!