Pawan Kalyan: రైట్ లీడర్ లెఫ్ట్ జపం?.. ఖమ్మంలో కమ్యూనిజం మంత్రం.. పవన్ కళ్యాణ్ భావజాలాల గందరగోళం

By Mahesh KFirst Published Nov 23, 2023, 6:58 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సనాతన ధర్మం, సోషలిజం రెండింటినీ జనసేన పార్టీ వెంట తీసుకెళ్లుతుందని అన్నారు. పరస్పరం విరుద్ధ భావజాలాలను రెండింటినీ ఏకకాలంలో మోసుకెళ్లుతామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
 

పవన్ కళ్యాణ్ లేటుగానైనా తెలంగాణలో ప్రచారం మొదలు పెట్టారు. తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థులను బరిలోకి దించింది. ఇక్కడ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. ఇప్పుడిప్పుడే ప్రచారం జోరు పెంచుతున్నది. ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా .. అందులో నాలుగు సీట్లు ఖమ్మం నుంచే ఉన్నాయి. ఖమ్మంలో కమ్యూనిజం ప్రభావం ఎక్కువ. చే గెవారా ఫొటోతో పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇక్కడ కమ్యూనిజం జపం చేస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో ప్రధానంగా రెండు రకాల భావజాలాలు కనిపిస్తాయి. రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్. వీటికితోడు ఉదారవాదులు, సాంప్రదాయవాదులు.. వగైరా కనిపిస్తారు. ఇందులో రైట్, లెఫ్ట్‌కు పొసిగే అవకాశాలే ఉండవు. సాంప్రదాయవాదులు రైట్ వైపు..  లిబరల్స్ లెఫ్ట్ వైపునకు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయి. కానీ, మధ్యేమార్గంగానైనా లెఫ్ట్, రైట్ కలిసే అవకాశాలు దాదాపు అసాధ్యం. అవి పరస్పరం విరుద్ధమైన భావజాలాలు. కానీ, పవన్ కళ్యాణ్ వీటి రెంటినీ ఒకే ఒరలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ వింగ్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ అప్పుడప్పుడూ బీజేపీ ఆలోచనలనూ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటారు. అలాంటి రైట్ వింగ్ శిబిరంలోని నేత ఇప్పుడు లెఫ్ట్ వింగ్ గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగానే ఉన్నది. కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ఎరుపు, కాషాయాల గురించి మాట్లాడారు.

సనానత ధర్మం, సోషలిజం రెండింటినీ ఏకకాలంతో వెంట తీసుకుని వెళ్లుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని బీజేపీ బలంగా మద్దతు తెలుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కమ్యూనిస్టుల ఆలోచనలకు జనసేన మనస్ఫూర్తిగా అండగా ఉంటుందని, తమవి కూడా అలాంటి ఆలోచనలేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే, తాము రాజ్యంగబద్ధంగా నడుస్తామని చెప్పారు. అంటే.. వామపక్షాల్లోని నక్సలైట్ల గురించి ఆయన మాట్లాడారా? అనే సందేహాలు వస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇస్తూ కమ్యూనిజం ఆలోచనల గురించి సానుకూలంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది.

Also Read: Pawan Kalyan...స్నేహం, రాజకీయాలు వేరు: కేసీఆర్, రేవంత్ రెడ్డితో స్నేహంపై పవన్

ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆయన కావాలనే కమ్యూనిజం గురించి మాట్లాడారనే అనుకుందాం. కానీ, ఆయన అభ్యర్థి పోటీ చేస్తున్నదే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పైనా. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ రావు పోటీ చేస్తున్నారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. సీపీఎం కూడా సీపీఐకి మద్దతు ప్రకటించింది. దీంతో మొత్తంగా సీపీఐ, సీపీఎంలపైనే పోటీ చేస్తూ కమ్యూనిజం ఆలోచనలను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్టయింది.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలోనూ ఈ ఖంగాళి కనిపిస్తుంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్న సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఎక్కువగా వామపక్ష దిగ్గజాల గురించి మాట్లాడేవారు. చే గెవారా, క్యాస్ట్రో వంటి వారిని ఉటంకించేవారు. కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పవనిజం అని ప్రచారం చేశారు. పవనిజం అనే పదంపైనా చాలా గందరగోళం కొనసాగింది. తాజాగా, తన ఇజం హ్యూమనిజం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

2019 ఏపీలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో అధికారికంగా పొత్తులో ఉన్నారు. టీడీపీతోనూ కలిసి ముందుకు పోతామని పవన్ చెప్పారు. ఏపీలో ఇప్పటికీ ఈ బంధంపైనా అస్పష్టతే ఉన్నది. ఏపీలో టీడీపీతో జట్టుకట్టి బీజేపీకి బై చెప్పే పరిస్థితులు తెచ్చుకోవద్దనే ఉద్దేశంతోనే తెలంగాణ బీజేపీ.. జనసేనతో బలవంతంగా పొత్తు పెట్టించుకుందనే విశ్లేషణలూ మరో వైపు ఉన్నాయి.

2014లో టీడీపీ, బీజేపీతో సఖ్యత కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నదనే విశ్లేషణలూ ఉన్నాయి. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయలేదని విమర్శలూ వస్తున్నాయి. 

click me!