బీజేపీతో పవన్ కళ్యాణ్ అడుగులు... చంద్రబాబు స్కెచ్ ఇదే!

By telugu teamFirst Published Jan 14, 2020, 1:50 PM IST
Highlights

నిన్న ఢిల్లీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పెట్టుకోబోతున్నట్టు చెప్పాడు పవన్ కళ్యాణ్ . సో, తొలిసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీచేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడిదాకా బాగానే ఉంది. ఇక్కడ అందరికి ఇప్పుడు మనసులో మెదులుతున్న ప్రశ్న..మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? టీడీపీ తో కలిసి వీరు ఇప్పుడు బరిలో దిగుతారా లేదా?

అమరావతి: పవన్ కళ్యాణ్ ఢిల్లీ గతంలో వెళ్ళివచ్చినప్పటి నుండి ఆయన మాటతీరులో ఒక స్పష్టమైన తేడా అందరికి కనబడింది. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని అప్పట్లో ఏపీ కి తిరిగివచ్చిన తరువాత నుండి మొదలు హిందుత్వ రాజకీయాలను ఆకళింపు చేసుకున్నవాడిగా మాట్లాడుతున్నాడు. బీజేపీకి తానెక్కడ దూరమయ్యానంటూ లీకులు ఇవ్వడం మొదలుపెట్టాడు. 

ఈ లీకులనే నిజం చేస్తూ తాజాగా ఆయన నిన్న ఢిల్లీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పెట్టుకోబోతున్నట్టు చెప్పాడు పవన్ కళ్యాణ్ . సో, తొలిసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీచేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది.

ఇక్కడిదాకా బాగానే ఉంది. ఇక్కడ అందరికి ఇప్పుడు మనసులో మెదులుతున్న ప్రశ్న..మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? టీడీపీ తో కలిసి వీరు ఇప్పుడు బరిలో దిగుతారా లేదా?

ప్రస్తుతానికి బీజేపీకి టీడీపీకి మధ్య మైత్రి కొనసాగుతుందనేది మాత్రం అందరికి అర్థమవుతున్న ఒక విషయం. ఏదో అమరావతిపైన టీడీపీకి సపోర్ట్ చేశారని కాదు...రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను బట్టి చూస్తుంటే మనకు బీజేపీ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది.

Also read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి..

ఇటు వైసీపీ తోను అటు టీడీపీ తోను సమాన దోస్తీని నెరుపుతుంది. టీడీపీతో పూర్తి స్థాయి దోస్తీ చేయడానికి బీజేపీ మొగ్గు చూపెట్టిన వైసీపీ ఎంపీల వల్ల బీజేపీ వైసీపీని పూర్తిగా పక్కకు పెట్టలేకపోతుంది. 

శివసేన బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడం, పౌరసత్వ సవరణ చట్టం ఇత్యాదుల వల్ల కొన్ని చిన్నాచితకా పార్టీలు బీజేపీకి ఏ క్షణమైనా మద్దతు ఉపసంహరించి రాజ్యసభలో బిల్లులు పాస్ కాకుండా అడ్డుపడొచ్చు.

లోక్ సభలో బీజేపీకి వచ్చిన నష్టం లేకున్నప్పటికీ రాజ్యసభలో ఏప్రిల్ నాటికి వైసీపీ బలం 6 సీట్లవుతుంది. 6గురు రాజ్యసభ సభ్యుల గ్రూప్ అనేది ఎంత మాత్రము విస్మరించగలిగే సంఖ్య కాదు.

ఈ నేపథ్యంలో వైసీపీ తో కూడా బీజేపీ సన్నిహితంగానే మెలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ... కేంద్రం మాత్రం సన్నిహితంగానే ఉంటుంది. 

ఇక టీడీపీ విషయానికి వస్తే... టీడీపీ రాజ్యసభ సభ్యులు అమాంతం వెళ్లి బీజేపీలో చేరడం అప్పట్లో చంద్రబాబు రాజకీయ వ్యూహమని అందరూ అన్నారు. దానినే బలపరుస్తూ...చంద్రబాబు సైతం ప్రవర్తిస్తున్నారు.

Also read: పవన్ కల్యాణ్ తో దోస్తీ: చంద్రబాబుకు బిజెపి భారీ షాక్

పార్లమెంటు ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్ అంటూ కూటమి కట్టి హడావుడి చేసిన చంద్రబాబు... ఇప్పుడు అసలు ఆ ఊసే ఎత్తకుండా తిరుగుతున్నారు. అవతల దేశమంతా పౌరసత్వ సవరణ చట్టంపై ఉడికిపోతుంటే...అసలు తనకేమి పట్టనట్టు వ్యవహరించడమే కాకుండా, ఆ చట్టాన్ని సమర్థిస్తూ పార్లమెంటులో ఓటు కూడా వేశారు. 

దీన్ని బట్టి చంద్రబాబు కూడా బీజేపీతో సఖ్యతతోనే మెలుగుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ను కూడా కలిపి తీసుకుంటే... తాజాగా పవన్ చేసిన ఒక వ్యాఖ్యను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది.

గత అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ ఆయనొక మాట అన్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీలు గనుక కలిసి పోటీ చేసుంటే...వైసీపీ పని అయిపోయేదని వ్యాఖ్యానించాడు. 

ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అందరికీ ఒక అనుమానం కలుగుతుంది. పవన్ ఈ సారి టీడీపీతో కలుస్తాడా అని అడుగుతున్నారు. భవిష్యత్తులో ఆ ఛాన్స్ లేకపోలేదు. కానీ ఈ సస్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం కలిసి పొత్తు పెట్టుకునే ఆస్కారమే లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో గనుక బీజేపీ కలిస్తే... చంద్రబాబు వైఖరిని ఎండగట్టడానికి వైసీపీకి ఒక ప్రధాన అస్త్రాన్ని స్వయంగా చంద్రబాబే అందించినట్టవుతుంది. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏ రేంజ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం నడిపాడో, బీజేపీని తూర్పారబట్టాడో మనమందరం చూసాము. అప్పుడు చంద్రబాబు చేసిందంతా డ్రామా అని వైసీపీ వారు చాలా తేలికగా కొట్టి పారేస్తూ...చంద్రబాబు భవిష్యత్తులో చేసే అన్ని ఉద్యమాలను కూడా ఇదే కోణంలో చూపించే వీలుంటుంది. 

Also read: పవన్, బాబులకు చెక్: అమరావతిపై వైఎస్ జగన్ సరికొత్త వ్యూహం

ఇప్పటికే సిపిఐ, టీడీపీలు ఒకే మాట అన్నట్టుగా సాగుతున్నాయి దాదాపుగా వారిద్దరి మధ్య పొత్తు ఖాయంగా కనబడుతోంది. సిపిఎం వైఖరే ఇప్పటివరకు క్లియర్ గా చెప్పడం లేదు. జనసేన బీజేపీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గనుక ఇలా ఒకరిమీద ఒకరు గనుక పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార వైసీపీకి మరింత లభ్యం చేయకూరుస్తుంది. 

ఈ పరిస్థితుల్లో వీరి మధ్య ఒక అప్రకటిత అంతర్గత రహస్య పొత్తును మాత్రం మనం చూసే వీలుంది. ఒకరు బలంగా ఉన్న చోట మరొకరు పోటీచేయకుండా ఉండడం లేదా అంతర్గతంగా మద్దతు ప్రకటించడం మొదలైన పనులను మాత్రం ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఉంది. 

ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలయ్యింది. ప్రజలంతా ఆసక్తిగా ఓట్ల పండగకు ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో ఎవరికి వారు తమ వర్గాలను సమాయత్తం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నీ వారి వారి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. చూడాలి ఎన్నికల చిత్రం ఎలా ఉండబోతుందో... 

click me!