చంద్రబాబుకు భారీ షాక్: కేసీఆర్ వ్యూహంతో తెలంగాణ టీడీపీ వాష్ ఔట్

By telugu teamFirst Published Jul 9, 2021, 1:30 PM IST
Highlights

తెలంగాణలో టీడీపీ వాష్ ఔట్ అయ్యే దిశగా సాగుతోంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. చంద్రబాబుకు తెలంగాణలో టీడీపీని నిలబెట్టే పరిస్థితి లేదు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో భారీ షాక్ తగిలింది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరబోతున్నారు. దీంతో నామమాత్రంగా ఉన్న టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంది. 

రావుల చంద్రశేఖర రెడ్డి వంటి కొద్ది సీనియర్ నాయకులు మాత్రమే టీడీపీలో మిగిలి ఉన్నారు. రెండోసారి ఎల్. రమణను టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. పార్టీలో కొంత మంది ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ చంద్రబాబు వారి మాటలు వినకుండా ఎల్ రమణకు టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. 

తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితికి చేరుకుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎల్ రమణ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ కూడా చేయలేకపోయింది. 

ఒకప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన పార్టీగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ జీరో అయింది. నాయకులు మాత్రమే కాదు, కార్యకర్తలు కూడా ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గానీ చేసేందేమీ లేదు. ఎన్టీఆర్ వారసత్వాన్ని ఉపయోగించుకోవడానికి నందమూరి సుహాసినిని దించినా ఫలితం లేకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తొలి దశలో, ఓటమి తర్వాత బలాన్ని నిలువరించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు పనిచేయాల్సిన అనివార్యతలో పడ్డారు. తొలుత తెలంగాణపై కొంత శ్రద్ధ పెట్టిన నారా లోకేష్ ఫలితం కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై చంద్రబాబు తీసుకున్న వైఖరి పూర్తిగా పార్టీని దెబ్బ తీసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరడంతో అది ఆగిపోతుందని కూడా చెప్పలేం. టీడీపీని కాపాడుకోవడానికి చంద్రబాబు ఏం చేసినా ఫలితం దక్కే అవకాశం లేదు. అందుకే ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ కూడా ఆయన పార్టీని పట్టించుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. 

రేవంత్ రెడ్డీ తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెసులోకి కూడా టీడీపీ వలసలు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ లో చేరని నాయకులు అటు కాంగ్రెసునో, బిజెపినో పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. 

click me!