కాంగ్రెస్ శ్రేణుల్లో భట్టి పీపుల్స్ మార్చ్‌తో జోష్.. 17 జిల్లాల మీదుగా సాగిన యాత్ర.. నేడు ఖమ్మంలో ముగింపు సభ..

By Asianet NewsFirst Published Jul 2, 2023, 12:00 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ నెలకొంది. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన  సభకు రాహుల్ గాంధీ హాజరుకానుండటం, భట్టికి సన్మానం చేయనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ నెలకొంది. ఓ వైపు చేరికలు.. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్ర. ఈ రెండింటికి ఖమ్మం జిల్లాలో నిర్వహించే జనగర్జన సభ వేదిక కానుంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానుండటం, భట్టికి సన్మానం చేయనుండటంతో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు తరలివెళ్తున్నారు. ప్రధానంగా  ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సభకు తరలిస్తున్నారు. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.
 
భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ భట్టి పాదయాత్ర చేశాడని.. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం, పార్టీలో చేరికలు.. రాష్ట్రంలో పార్టీకి మరింత  జోష్‌ను తెచ్చాయని అంటున్నారు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్‌ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచిందనే విశ్లేషణలు విపిస్తున్నాడు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడనే చెబుతున్నారు. 
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌ పాదయాత్ర కంటే ముందు.. ఆ తర్వాత అనేలా మార్చేశారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క గతకొద్దిరోజులుగా  వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ఆయన 17 జిల్లాల్లోని అనేక ప్రజాసమస్యను గుర్తించ‌గలిగారు. మారుమూల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ పేద ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మొద‌లుకుని ఖమ్మం  వరకు సాగిన భట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్‌కు కొంత ఊపునిచ్చింది. తాజాగా ఖ‌మ్మం న‌గ‌రంలో త‌ల‌పెట్టిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌కు రాహుల్ హాజరవుతుండటంతో.. భట్టి విక్ర‌మార్క చేపట్టిన ఈ యాత్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఆకర్షించిందనే  చెప్పాలి. 
 
జనగర్జన సభ వేళ.. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా కాంగ్రెస్ జెండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20x20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు. ఖమ్మలో రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. దీంతో ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.

click me!