తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీదున్నది. ఖమ్మం సభతో ఇది ద్విగుణీకృతమై రాష్ట్రంలో ఎన్నికల రాజకీయంలో కాంగ్రెస్ కేంద్రస్థానానికి వెళ్లేలా ఉన్నది. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతుండగా.. బీజేపీలో మాత్రం టెన్షన్ పెట్టిస్తున్నది. ఎన్నికల ముందు ఆ పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కడం, పార్టీ నాయకత్వంలో మార్పులు పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీ వీడుతారనే భయాలూ వెంటాడుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ పార్టీలు, నేతలు, క్యాడర్, ప్రజలూ అందరూ ఖమ్మం వైపే చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించే జనగర్జన సభను కాంగ్రెస్ తన ఆధిపత్యానికి తొలిమెట్టుగా ఉపయోగించుకోనుంది. తాము దాదాపు అధికారానికి దగ్గరయ్యామనే విశ్వాసాన్ని పార్టీ నేతలు, క్యాడర్‌లో కలిగించడమే కాదు.. ప్రజల్లోనూ ఒక అభిప్రాయాన్ని కల్పించేలా ఈ సభ జరుగుతున్నది. దీంతో ఢిల్లీ నుంచీ ఇక్కడ ఫోకస్ పడింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు నుంచీ ఈ సభపై దృష్టి పెట్టగా ఢిల్లీ బీజేపీ పెద్దలూ ఇటు వైపు నజర్ వేస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత బలమైందిగా కనిపించిన బీజేపీ అనూహ్యంగా బలహీనపడింది. అదే రీతిలో కాంగ్రెస్ అనుకోని రీతిలో బలపడింది. ఒక రకంగా బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసింది. బీజేపీలో అంతర్గత వర్గపోరు బయటపడుతుండగా.. కాంగ్రెస్‌లో నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీ కాంగ్రెస్ అని చూపెట్టుకోవడానికే పరిమితం కాకుండా.. ఈ ఎన్నికల్లో అధికారాన్ని సాధించగలమనే సంకేతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని హస్తం పార్టీ భావిస్తున్నది. ఇది తమకు ఎదురేలేదన్న ధీమాతో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నది.
undefined
భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటి సహా ఇతర నేతల చేరిక సభగా, కాంగ్రెస్ సమర శంఖారావ సభగా జనగర్జన సభ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునేటప్పపుడు యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు.
పునరుజ్జీవం పొందుతున్నట్టు, కొత్త జోష్ నింపుకుంటున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ కనిపిస్తుండగా.. తెలంగాణ బీజేపీలో మాత్రం గందరగోళం కనిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడే ఏ మాటల బాంబు పేల్చుతారో అన్నట్టుగా ఉండే తీరు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్నది. తెలంగాణ బీజేపీ నేతలు బాహాటంగా చేస్తున్న కామెంట్లు విభేదాలను మరింత జఠిలం చేసేలా ఉన్నాయి. పార్టీలో నుంచి కీలక నేతలు బయటక వెళ్లుతారనే భయాలు ఒక వైపు ఉండగా.. పార్టీ నాయకత్వంలోనూ మార్పు ఉంటుందనే సంకేతాలు రావడం మరింత కలవరాన్ని పెంచింది. కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నదని, కానీ, ఆయన అందుకు సుముఖంగా లేరనే వార్తలూ వచ్చాయి. ఇదిలా ఉండగా ఖమ్మం సభకు రాహుల్ హాజరు కావడం, భారీ ఎత్తున ఏర్పాట్లు బీజేపీకి మింగుడుపడటం లేదు. ఒకింత టెన్షన్ మొదలైంది.
మరోవైపు ఈ పరిణామాలు బీఆర్ఎస్ కూడా జీర్ణించుకోవడం లేదు. అవాంతరాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నదని తెలుస్తున్నది. ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వటానికి అంగీకరించి ఆ తర్వాత నో చెప్పడమే ఇందుకు నిదర్శనం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రుల ఒత్తిడితో ఈ నిర్ణయాన్నీ మార్చుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరి కలు, వేగంగా దూసుకు పోవడం ప్రగతి భవన్‌లో చర్చనీయాంశ మైనట్టు తెలిసింది. ఖమ్మం సభతో ఎన్నికల రాజకీయం కాంగ్రెస్ వైపు మళ్లుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.