బీఆర్‌ఎస్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన రేవంత్.. కాంగ్రెస్‌ను ‘‘షాక్’’ నుంచి తప్పించేందుకు భట్టి ఫైర్ ఫైటింగ్..!!

By Asianet News  |  First Published Jul 27, 2023, 5:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య మాటల యుద్దం పెరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ తప్పు దొరికితే చాలు మిగిలిన  పార్టీలు వాటిని అస్త్రంగా మార్చుకుంటున్నాయి.


తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య మాటల యుద్దం పెరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ తప్పు దొరికితే చాలు మిగిలిన  పార్టీలు వాటిని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా.. ఒక విధంగాబ్రహ్మాస్త్రం మలుచుకుంది. రేవంత్ వ్యాఖ్యలతో పాటు.. గతంలో కాంగ్రెస్‌ పాలనలో అభివృద్దేమి లేదంటూ విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ‌చాలా వరకు సక్సెస్ అయింది. అయితే దీనిని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగానే ప్రయత్నించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ జరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఆ డ్యామేజ్‌ను తిప్పికొట్టి.. బీఆర్ఎస్‌పై అటాక్ చేసేందుకు సీఎల్పీ నేతల వినూత్నంగా సెల్ఫీ కార్యక్రమం మొదలుపెట్టారు. ‘సెల్పీ విత్ కాంగ్రెస్‌ డెవలప్‌మెంట్‌’ పేరుతో ప్రచారాన్ని చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణకు జరిగిన మేలు వివరించేందుకు నిర్ణయించారు. ప్రధానంగా  ఉచిత విద్యుత్‌‌ను ప్రస్తావిస్తూ.. వివిధ రంగాల్లో జరిగిన అభివృద్దిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

Latest Videos

రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్సేనని.. వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే ఉచిత విద్యుత్ ఫైలుపై తన తొలి సంతకం పెట్టారని గుర్తుచేస్తున్నారు. ఆ ఫొటోతో భట్టి విక్రమార్క సెల్ఫీ తీసీ.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు.

అంతేకాకుండా తాము  గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలకు మరొకసారి గుర్తుకుతెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్.. ఇలా ఇతర ప్రాజెక్టులను కూడా గత కాంగ్రెస్ హయాం అభివృద్ధి చేసిందని భట్టి తెలిపారు. వీటన్నింటిపై విస్తృత ప్రచారం కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేరవేర్చని హామీలు, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 

తద్వారా కరెంట్ వ్యాఖ్యల షాక్ నుంచి కాంగ్రెస్‌ను బయటపడేసేందుకు అధికార బీఆర్ఎస్‌పై భట్టివిక్రమార్క గట్టిగానే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో అధిష్టానం వద్ద మంచి మార్కులే కొట్టేసిన భట్టి విక్రమార్క.. తాజాగా చేపట్టిన  ‘‘సెల్పీ’’ కార్యక్రమంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సి ఉంది. 
 

click me!