గంగులపై కేసీఆర్ అసంతృప్తి: ఈటెలపై కేటీఆర్, హరీష్ రావు అస్త్రాలు

By telugu teamFirst Published May 19, 2021, 8:13 AM IST
Highlights

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించడానికి మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను దెబ్బ తీయడానికి మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితం ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటెలను హుజూరాబాద్ నియోజకవర్గంలో దెబ్బ తీసి, ఆ నియోజకవర్గంలో పట్టు సాధించడానికి మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావులను ప్రయోగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. 

హుజూరాబాద్ లో పట్టు సాధించడానికి గంగుల కమలాకర్ చేస్తున్న ప్రయత్నాలపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.  హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరిపి లేకుండా పర్యటించాలని కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత జూన్ లో వారిద్దరు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించే విధంగా కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. 

మే 2వ తేదీన మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన వెంటనే హుజూరాబాద్ ఇంచార్జీగా గంగుల కమలాకర్ ను నియమించారు. అప్పటి నుంచి ఆయన హజూరాబాద్ నియోజకవర్గంలోని స్థానిక నేతలతో, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈటెల రాజేందర్ వెనక ఏ పార్టీ నాయకుడు కూడా వెళ్లకుండా చూడాలని కేసీఆర్ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. 

అయితే, ఈటెల రాజేందర్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలతో గంగుల కమలాకర్ ను ఎదుర్కుంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, తదితర స్థానిక ప్రజా ప్రతినిధులు మొత్తం రాజేందర్ వెనక ఉండకుండా చూడాలని పార్టీ నాయకత్వం గంగులను ఆదేశించింది. అయితే, ఇప్పటికీ చాలా మంది ఈటెల రాజేందర్ వెనక నడుస్తున్నారు. గంగుల కమాలకర్ వద్ద పార్టీకి విధేయత ప్రకటించిన కొంత మంది స్థానిక నాయకులు ఈటెల వైపు తిరిగి వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. 

దాంతో ఈటెల రాజేందర్ కు ఏ మాత్రం మద్దతు లేకుండా చేసి, హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలోగా ఈటెల రాజేందర్ ను పూర్తి స్థాయిలో దెబ్బ తీయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆ ఇద్దరు మంత్రులకు కేసీఆర్ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

click me!