చిరంజీవి చెప్పినా వినని కమల్ హాసన్: పవన్ కల్యాణే బెట్టర్

By telugu teamFirst Published May 5, 2021, 2:52 PM IST
Highlights

రాజకీయాల జోలికి వెళ్లొద్దని మెగాస్టార్ చిరంజీవి చెప్పినా కమల్ హాసన్ వినలేదు. చివరి నిమిషంలో మనసు మార్చుకుని రాజకీయాలకు దూరంగా ఉండి రజనీకాంత్ పరువు దక్కించుకున్నారు.

రాజకీయాల్లోకి రావద్దని మెగాస్టార్ చిరంజీవి తమిళ నటులు రజినీకాంత్ కు, కమల్ హాసన్ కు చెప్పారు. తన స్వానుభవంతో చిరంజీవి వారికి ఆ సూచన చేశారు. చిరంజీవి సూచన వల్లనో, మరో కారణంతోనో గానీ మొత్తం మీద రజినీకాంత్ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే తేదీని ప్రకటించిన తర్వాత ఆయన తన మనసు మార్చుకున్నారు. ఆరోగ్యం కారణం చెప్పి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దాంతో ఆయన తన పరువును కాపాడుకున్నారనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, తమిళనాడు ఎమ్జీ రామచంద్రన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. జయలలిత అన్నాడియంకెను తన చేతుల్లోకి తీసుకున్నప్పటి పరిస్థితులు కూడా లేవు. సమాజం చీలికలు పేలికలుగా విడిపోయి ఉంది. ఏదో ఒక శక్తి నడిపిస్తే నడిచే పరిస్థితి లేదు. ఏమైనా రజనీకాంత్ మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి.

కాగా, కమల్ హాసన్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చి, సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కమల్ హాసన్ స్వయంగా బిజెపికి చెందిన వనతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1300 ఓట్ల స్వల్ప తేడాతోనే ఆయన ఓడిపోయినప్పటికీ ఓటమి ఓటమే. శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం రాలేదు. 

రాష్ట్రంలో కమల్ హాసన్ మూడో కూటమి కట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 142 స్థానాల్లో కమల్ హాసన్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. వారంతా పరాజయం పాలయ్యారు. ఇది తప్పకుండా కమల్ హాసన్ కు ఎదురు దెబ్బనే. రాజకీయాల గురించి ఆయన పునరాలోచించుకోవాల్సిన సందర్భాన్నే అది కల్పించింది. 

కాగా,  చిరంజీవికి ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ కమల్ హాసన్ కన్నా బెటర్ అని చెప్పవచ్చు. ఆయన జనసేన ఓ సీటును గెలుచుకుంది. పవన్ కల్యాణ్ మాత్రం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. చెప్పాలంటే, కమల్ హాసన్ కు పవన్ కల్యాణ్ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదు. కేవలం అభిమానుల మీద ఆధారపడి పార్టీలు స్థాపించడం వల్ల ఉపయోగం ఏదీ ఉండదని తేలిపోయింది.

కాగా, చిరంజీవి వీరందరి కన్నా నయమనిపిస్తారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 13 శాసనసభ స్థానాలను గెలుచుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శానససభలోకి అడుగు పెట్టింది. అయితే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయకుండా కొనసాగించి ఉంటే పరిస్థితి జనసేన కన్నా, మక్కల్ నీది మయ్యం కన్నా మెరుగ్గానే ఉండేదేమో.

click me!