ఈటల నుంచి ఆరోగ్య శాఖ కేసీఆర్ చేతికి, వెనుక ప్లాన్ ఇదేనా..?

By Sirisha S  |  First Published May 1, 2021, 8:07 PM IST

ఈటలను వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించి స్వయంగా ఆ శాఖను కేసీఆర్ తనకు బదలాయించుకున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తుంటే ఇందులో ఒక రాజకీయ ఎత్తుగడే ఉన్నట్టుగా కనబడుతుంది.


తెలంగాణలో  నిన్న ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ తాలూకు ప్రకంపనలు ఇప్పుడప్పుడు ఆగేవిలా కనబడడం లేదు. నిన్న రాజీనామా చేయకుండా విచారణను ఆహ్వానించి ఈటల బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేసారు. ఈటలను బయటకి పంపేందుకు డిసైడ్ అయిన తెరాస అధినాయకత్వం నేడు మరో ముందడుగు వేసింది. ఈటలను వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించి స్వయంగా ఆ శాఖను కేసీఆర్ తనకు బదలాయించుకున్నారు. 

కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తుంటే ఇందులో ఒక రాజకీయ ఎత్తుగడే ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం దేశం మొత్తంతో పాటు తెలంగాణాలో కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూనే ఉంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ కొరత, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వాక్సిన్లు లేక రెండు రోజులు 45 వయసు పైబడిన వారికి కూడా వాక్సిన్లు ఇవ్వడంలేదు. 

Latest Videos

undefined

ఇలాంటి పరిస్థితుల నడుమ ఈటల రాజేందర్ నుండి ఆరోగ్యశాఖ కేసీఆర్ చేతికి బదిలీ అయింది. బదిలీ అవ్వడంతోనే కేసీఆర్ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బలమైన చర్యలకు పూనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కరోనాపై పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ నియమించారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించిన స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

రెమ్‌డిసివర్ వంటి మందుల విషయంలో గానీ, వ్యాక్సిన్‌ల విషయంలో గానీ ఆక్సిజన్, బెడ్‌ల లభ్యత విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎం సూచించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించి వీలైనంత త్వరలో రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని కేసీఆర్ ఆదేశించారని సీఎంఓ ట్వీట్ చేసింది. 

కేసీఆర్ ఇంత స్థాయిలో సమీక్ష నిర్వహించడం వల్ల ఈటల సరిగా పనిచేయలేదా అనే చర్చను ప్రజల మధ్య జరిగేలా కేసీఆర్ చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈటల వాస్తవంగా తన పరిధి మేర సాధ్యమైనంత స్థాయిలో బాగానే పనిచేసారు. ఇప్పుడు కేసీఆర్ కరోనా ను తరిమికొట్టడానికి చర్యలు తీసుకోవడం అంటే ఆయన ఇప్పుడు ఈటల కన్నా బెటర్ గా ఈ మహమ్మారిని హ్యాండిల్ చేయవచ్చనే సంకేతాన్ని పంపిస్తున్నారు. 

ఈటల మీద సింపతీ జనాల్లో కలిగినప్పటికీ... కేసీఆర్ ఈ మహమ్మారిని మరికొన్ని రోజుల్లో అదుపులోకి తీసుకొస్తే వెంటనే ఈటల కన్నా కేసీఆర్ బెటర్ అని జనాలు అనుకుంటారు. ప్రస్తుత మాథెమటికల్ స్టడీస్ కూడా కేసీఆర్ కి అనుకూలంగా ఉన్నాయి. దేశంలో మే మధ్యనాటికి పీక్ కి కేసులు చేరుకోవచ్చని ఒక అంచనా, కానీ తెలంగాణలో పీక్ ఈపాటికి చేరుకొని ఉంటుందని ఒక అధ్యయనం చెబుతుంది. ఇదే గనుక నిజమైతే తెలంగాణాలో త్వరలోనే కేసులు స్టెబిలైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అప్పుడు క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోకి వెళ్లడంతోపాటు ఈటలను తప్పించి రాష్ట్రాన్ని కాపాడారు అనే వార్త కూడా ప్రచారంలోకి వస్తుంది. చూడాలి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమేర కేసీఆర్ కి కలిసి వస్తుందో..!

click me!