కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు టెన్త్, ఇంటర్ పరీక్షలను యధాతథంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.
దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి ఊబిలో చిక్కుకొని విలవిల్లాడిపోతోంది. మందులు, ఆక్సిజన్, సరైన వైద్యం అందక ఎందరో మరణిస్తున్నారు. మరణించడమే కాదు, కనీసం ఎవరైనా మరణిస్తే వారిని పూడ్చడానికి స్థలం కూడా దొరకడం లేదు. కారు పార్కింగ్, ఫుట్ పాత్ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ శవాలను ఖననం చేస్తున్నారు. శవాలను కాల్చడానికి కట్టెలు సరిపోక చెరుకు పిప్పి కూడా వాడుతున్న దయనీయ స్థితి.
దేశంలో రోజువారీ కేసులు నాలుగు లక్షలను మరో ఒకటి రెండు రోజుల్లో దాటబోతున్నట్టు, మే మధ్య నాటికి రోజుకి 10 నుంచి 12 లక్షల కేసుల వరకు నమోదవ్వచ్చని కొందరు శాస్త్రవేత్తలు లెక్కలు కడుతున్నారు. ఈ స్థాయి కేసులు నమోదైతేనే దేశ ఆరోగ్య వ్యవస్థ కుదేలవుతోంది, మరి అన్ని కేసులను దేశం తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్న అందరి మనసులను తలచివేస్తుంది.
undefined
ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. రోజు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరుతెలిసినవారో, బంధువులో కరోనాతో మరణించారనే వార్తను వింటూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ పరిస్థితులను అదుపుచేయలేక లాక్ డౌన్ కూడా పెట్టేశాయి.
మన తెలుగుకి రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ పెట్టే స్థాయికి పరిస్థితులు దిగజారాయంటే కరోనా వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. రోజువారీ కేసులు ఏపీలో ఎప్పుడో 10 వేల మార్కుని దాటేశాయి. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు టెన్త్, ఇంటర్ పరీక్షలను యధాతథంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.
దీనిపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ... జగన్ మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమే చేసాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ లు కూడా ఇదే బాటలో పయనించాయి. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జగన్ సర్కార్ నిర్ణయం ఉండడం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఆఖరికి నేడు హైకోర్టు సైతం ఈ విషయాన్ని గురించి పునరాలోచించమని చెప్పింది. జగన్ మాత్రం పట్టు వీడడం లేదు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మార్కులు వాటి ప్రాముఖ్యత గురించి ఏదో వివరించారు. భవిష్యత్తు బాగుండాలంటే ముందు బ్రతకాలి కదా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
దేశం మొత్తంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు సర్టిఫికెట్ల మీద ఒకే రకంగా కరోనా కాలంలో పాస్ అయ్యారు అనేది ముదిరింపబడి ఉంటుంది(ఏదో ఒక రూపంలో). దీన్ని దేశమంతా అర్థం చేసుకుంటుంది. దానికి ఏపీ విద్యార్థులేమి అతీతులు కాదు. ఇదేదో లైఫ్ డిసైడింగ్ పరీక్షలు అన్నట్టు, టెన్త్, ఇంటర్ పూర్తవగానే ప్రభుత్వం ప్లేస్ మెంట్స్ కల్పిస్తుందా చెప్పండి.
ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎత్తుకున్నాయి కాబట్టి తన పంతం నెగ్గించుకోవాలని జగన్ చూస్తున్నారు తప్ప వేరొకటి కాదు. అయినా పరీక్ష హాల్లొ అన్ని ఏర్పాట్లను జగన్ సర్కార్ చేసినప్పటికీ... అక్కడకు చేరుకునే సమయంలో ప్రయాణం చేయవలిసి ఉంటుంది. ఒకరికి సోకిందంటే క్లోజ్డ్ రూముల్లో అది ఎలా వ్యాపిస్తుందో వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా జగన్ సర్కార్ తన మొండి పట్టు వీడి పరీక్షలను వాయిదా వేయడమో, లేదా రద్దు చేయడమో చేస్తే కనీసం వారి ప్రాణాలను, వారి తల్లిదండ్రుల ఆశలను కాపాడినట్టవుతుంది. చూడాలి విద్యార్థులకు మామను అని చెప్పుకునే జగన్ ఏమి చేస్తారో..?