అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ: ఆంధ్ర సెటిలర్ల ఓట్లకు గాలం

By Pratap Reddy KasulaFirst Published Aug 22, 2022, 11:05 AM IST
Highlights

జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనక బిజెపి పక్కా వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ సిఎం కేసిఆర్ ను ఎదుర్కోవడానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి, బిజెపి నేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలకమైన మలుపుగా భావించవచ్చు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. తెలుగు సినీ ప్రముఖుల మద్దతు కూడా పొందేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఇందులో భాగమేనని చెబుతున్నారు.

నిజానికి, ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యే విషయం బిజెపి తెలంగాణ నాయకులకు ముందుగా తెలియదు. అమిత్ షా కార్యక్రమాలు బిజెపి రాష్ట్ర నాయకులకు కొద్ది ముందుగానే తెలుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు మెచ్చి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని అంటున్నారు. అదే నిజమైతే అమిత్ షా రామ్ చరణ్ ను కూడా ఆహ్వానించి ఉండేవారనే మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రయోజనం పొందడానికి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సమావేశమయ్యారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఆ భేటీ జరిగి ఉండవచ్చు. అంతేకాకుండా టీడిపికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. 2009లో టీడిపి కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత మొత్తం రాజకీయాలకే దూరమయ్యారు. 

అయితే, అమిత్ షాతో భేటీపై జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. నిజానికి, జూనియర్ ఎన్టీఆర్ మనసంతా టీడీపిపై ఉంది. టీడీపిలో పరిస్థితులు ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా లేవు. ఎన్టీఆర్ కు పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వాలని టీడీపిలోని ఓ వర్గం కోరుతున్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు అందుకు సముఖంగా లేరు. తన వారసుడిగా ఆయన తన కుమారుడు నారా లోకేష్ ను నిలబెట్టాలని చూస్తున్నారు. ఈ కారణంగానే టీడిపికి ఎన్టీఆర్ దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ అనుకుంటే టీడీపితోనే ఉంటారు తప్ప మరో పార్టీలో చేరబోరు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని ఆయన స్వీకరించాలని చూస్తున్నారు.

అయితే, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఎందుకయ్యారనేది ప్రశ్న. వీలైతే ఆయనను పార్టీలోకి తీసుకుని రావాలనే అమిత్ షా ఉద్దేశ్యమై ఉండవచ్చు. లేదా తమ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ప్రభావితం చేయడం కూడా అయి ఉండవచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు గట్టి పోటీ ఇచ్చి వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బిజెపికి తెలంగాణలో అంధ్ర ఓటర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా హైదరాబాదులోనూ దాని పరిసర ప్రాంతాల్లోనూ బిజెపికి మంచి పట్టు ఉంది. దానికి ఆంధ్ర ఓటర్ల మద్దతు తోడైతే బిజెపి అధిక శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఓ అంచనా. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు అందుకు ఉపయోగపడుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అది బిజెపికి ఉపయోగపడుతుంది. 

click me!