ఏపీలో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నీడ వెంటాడుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
సినీ నటుడు, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నీడ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిని వెంటాడుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తేవాలని, ఆయనకు టీడీపీలో స్థానం కల్పించాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ అనుకూల నినాదాలు వినిపించాయి.
కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీలో క్రియాశీలక పాత్ర ఇవ్వాలని మాత్రమే మచిలీపట్నం చంద్రబాబు పర్యటనలో డిమాండ్ చేయలేదు. తదుపరి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ నినాదాలు వినిపించాయి. ఆ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రచార బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వచ్చింది.
undefined
టీడీపీ అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి బాలకృష్ణపై ఆశలు వదిలేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీడీపీ పగ్గాలు చేపట్టే స్థితిలో లేరని వారు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు చేసుకుంటూ చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ దే స్థానం. నారా లోకేష్ ను కాదని బాలకృష్ణ మరో విధంగా వ్యవహరించే అవకాశం లేదు. స్వయానా కూతురిని ఇచ్చిన మామ కావడంతో బాలకృష్ణ నారా లోకేష్ ను కాదనే స్థితిలో లేరు. ఏమైనా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పనిచేయగలరు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశాన్ని బాలకృష్ణ ఇష్టపడడం లేదు. పైగా, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అందరూ రామారావులు కాలేరని ఆయన వ్యాఖ్యానించారు. అంటే తమ తండ్రి ఎన్టీ రామారావు వేరు, జూనియర్ ఎన్టీఆర్ వేరని ఆయన చెప్పినట్లయింది.
టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీ శ్రేణులకు ఆశగా కనిపిస్తున్నారు. అందుకే చంద్రబాబు పర్యటనల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సందడి కనిపిస్తోంది.