టీ కాంగ్రెస్‌లో చేరికల జోష్ సరే.. మరి ఆ నేతల్లో కలవరం మాటేమిటి..!

By Asianet NewsFirst Published Jul 18, 2023, 4:09 PM IST
Highlights

తెలంగాణ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు కూడా ఎదురవుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీ కాంగ్రెస్‌లో చేరికలు ఓ వైపు జోష్ నింపుతుండగా.. మరోవైపు అంతర్గతంగా విభేదాలకు కూడా దారి తీస్తుంది.

తెలంగాణ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు కూడా ఎదురవుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీ కాంగ్రెస్‌లో చేరికలు ఓ వైపు జోష్ నింపుతుండగా.. మరోవైపు అంతర్గతంగా విభేదాలకు కూడా దారి తీస్తుంది. పలుచోట్ల నేతల చేరికలను అక్కడ చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు వ్యతిరేకించడంతో పాటుగా.. ముఖ్య నేతల వద్ద వారి అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న తమ పరిస్థితి ఏమిటని? ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేరికను.. ఇప్పటికే జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉండి, రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు వ్యతిరేకిస్తున్నారు. 

తాము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని.. కష్టకాలంలో సొంత డబ్బులు ఖర్చుపెట్టి కార్యకర్తలకు అండగా నిలిచామని.. మరి ఇప్పుడు బయటి పార్టీల నుంచి వచ్చేవారికి టికెట్లు ఇవ్వడమేమిటనే? వాదనను వారు పీసీసీ వద్దకు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో.. అక్కడ పలు నియోజకవర్గాల్లో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతల్లో కలవరం మొదలైంది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో పినపాక నుంచి గెలిచిన రేగాకాంతారావు,  పాలేరునుంచి గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందులో గెలిచిన బానోతు హరిప్రియ, కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. కాంగ్రెస్‌ను వీడి  గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే వీటితో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో సీట్లపై చాలా కాలంగా పార్టీలో ఉంటున్న నేతలు, భట్టి విక్రమార్క వర్గం నేతలు, రేణుకా చౌదరి వర్గం నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే పొంగులేటి, ఆయన వర్గం చేరికతో ఆ సీన్ ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు లేకపోలేదు. 

ఊదాహరణకు పినపాక తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన ఈ నియోజకవర్గంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య కొంతకాలంగా దృష్టి సారించారు. నియజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే పినపాక నుంచి సీతక్క కుమారుడు బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు పినపాకలో పొంగులేటి వర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు టికెట్‌ బరిలో ఉండనున్నారు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల్లో చేరికలతో కలవరం నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రెండు, మూడు నియోజకవర్గాల్లో కూడా  ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే ప్రచారం ఉంది. 

మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు అనే సిద్దాంతంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ నుంచి టికెట్ దక్కని బలమైన నేతలను కూడా హస్తం గూటికి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసిందనే ప్రచారం కూడా సాగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే.. చేరికలు జరిగే చోట చాలా ఏళ్లుగా పార్టీలో ఉండి టికెట్ ఆశిస్తున్న వారిలో తీవ్రమైన అసంతృప్తి చెలరేగే అవకాశం కూడా లేకపోలేదు. వారు పార్టీని వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదా వీడటం వంటి చర్యలకు దిగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలతో ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ విధంగా చేరికల స్ట్రాటజీతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. అసంతృప్త నేతలతో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. 
 

click me!