తీవ్రమైన అసంతృప్తితో పార్టీ అధినేత సోనియా గాంధీకి రాసిన లేఖ ప్రతిని కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించలేదని తెలుస్తోంది. దీన్నిబట్టి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదని భావించవచ్చు.
హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తమ పార్టీ అధినేత సోనియా గాంధీకి రాసిన లేఖ ప్రతిని కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించలేదు. జగ్గారెడ్డి సమస్య అంతా రేవంత్ రెడ్డితోనే అనేది చాలా కాలం నుంచి అర్థమవుతున్నదే. అయితే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని గుర్తించడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదని తాజా లేఖను బట్టి అర్థమవుతోంది. లేదంటే తాను ఎమ్మెల్యేను కాబట్టి పీసీసీ పరిధిలోకి రానని చెప్పడం కూడా కావచ్చు. ఏమైనా, రేవంత్ రెడ్డికి పిసరంత గుర్తింపు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదనేది స్పష్టమవుతోంది.
సోనియా గాంధీకి రాసిన లేఖ ప్రతులను జగ్గారెడ్డి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ కు, కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కు, ఏఐసిసి కార్యదర్శి బోసురాజుకు, ఏఐసీసీ కార్యదర్సి శ్రీనివాసన్ కృష్ణనన్ కు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ కు, ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహకు, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు. తెలంగాణకు చెందిన ఇంత మంది నాయకులకు ఆ ప్రతులను పంపించిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి పంపించకపోవడం వెనక కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన రేవంత్ రెడ్డిని గుర్తించడానికి సిద్ధంగా లేరనేది దాని అర్థం.
undefined
దానికితోడు లేఖలో రేవంత్ రెడ్డిపై పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన ఎందరో నాయకులు బయటకు పోయారని అంటూ కాంగ్రెసులోకి సడెన్ గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చునని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఎత్తిపొడిచారు. అంతకన్నా తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కోవర్టు ముద్ర వేస్తున్నారనే విషయంపైనే ఎక్కువగా తన లేఖలో ప్రస్తావించారు. కుట్రపూరితంగా తనపై రేవంత్ రెడ్డి వర్గం కోవర్టు ముద్ర వేస్తున్నారనేది ఆయన అభియోగంగా కనిపిస్తోంది.
ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాతి క్షణం నుంచి తాను కాంగ్రెసు పార్టీ గుంపులో లేనని స్పష్టం చేశారు. పార్టీని గుంపుగా కూడా అభివర్ణించడం గమనార్హం. త్వరలో టీపీసీసీ అధ్యక్ష పదవికి,, కాంగ్రెసు పార్టీకి రాజీనామే చేసి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిస్తానని జగ్గారెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.
కాగా, జగ్గారెడ్డి లేఖ కాంగ్రెసులో తీవ్ర కలకలం సృష్టించింది. కాంగ్రెసు పార్టీకి ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. జగ్గారెడ్డి వ్యవహారం చాలా చిన్నదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మాట్లాడి పరిష్కరించుకుంటామని కూడా ఆయన చెప్పారు. తప్పులు దిద్దుకోమని చెప్తే కోవర్టు అన్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పరువు కాపాడిన తాను కోవర్టునా, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతులెత్తేసినవారు కోవర్టా అని కూడా ఆయన అన్నారు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డిపైనే జగ్గారెడ్డి బాణం ఎక్కుపెట్టారనేది స్పష్టంగా అర్థమవుతోంది.