2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను దీనికి ఆసరాగా చేసుకుంటోంది.
తెలంగాణలో మూడో సారి కూడా టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకుచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొదటి సారి ఎన్నికల్లో పని చేసిన తెలంగాణ సెంటిమెంట్ నే మూడో సారి ఎన్నికల్లో కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను దీనిని ఆసరా చేసుకొని, మరో సారి తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చారు. మొత్తంగా టీఆర్ఎస్ పైనే ప్రజల దృష్టి నిలిచి ఉండేలా చూసుకుంటున్నారు.
బలపడుతున్న బీజేపీ..
తెలంగాణలో బీజేపీ మెళ్ల మెళ్లగా బలపడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతీ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని టీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తోంది. హుజురాబాద్ ఎన్నికల సమయంలో వడ్ల కొనుగోలు ఇష్యూ తెరమీదకు వచ్చింది. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. టీఆర్ఎస్ సర్కార్ పైన విమర్శలు చేసింది. దీనికి కేంద్ర మంత్రుల సహకారం లభించింది. పార్లమెంట్ లో దీనిపై చర్చలు జరిగాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పంతా టీఆర్ఎస్ దే అని ఆరోపించింది. దీనిని డిఫెన్స్ చేయడానికి టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. రాష్ట్ర మంత్రుల బృందం రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వానాకాలం ధాన్యాన్ని పరిశీలించి, బీజేపీ రైతులకు మద్దతుగా ఉంటుందని తెలిపేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేశారు.
undefined
కొన్ని రోజుల తరువాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 పైన ఆందోళనలు చేసింది బీజేపీ. ఉద్యోగులను టీఆర్ఎస్ ఇబ్బంది పెడుతోందని ఆరోపించింది. దాని కోసం నిరసనలు చేపట్టింది. ఉద్యోగుల మద్దతును కూడబెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇలా వచ్చిన వెలుగులోకి వచ్చే ప్రతీ సమస్యను వాడుకొని రాష్ట్రంలో అందరి మద్దతును కూడగట్టుకొని బలపడాలని బీజేపీ చూస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఇలా రాష్ట్రంలో విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ వాడుకొని..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ ఏంటో పూర్తిగా తెలుసు. అందుకే రాష్ట్రంలో మెళ్లగా బలపడుతున్న బీజేపీని మొదటగా ప్రజల నుంచి దూరం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీని తెలంగాణ సమాజం దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ హైలెట్ అయ్యిందేందుకు చేస్తున్న పనులకు అడ్డుకట్ట వేస్తూనే.. ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర బీజేపీపై సీఎం కేసీఆర్ విరుచుపడుతున్నారు. కేంద్రం తెలంగాణకు చేసిందేం లేదని, రాష్ట్రంపై కేంద్ర బీజేపీ పక్షపాత వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో వచ్చేదేం లేదని, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణకు ఏం తీసుకురావడం లేదని వారిని ఇరకాటంలో పెడుతున్నారు. నిన్న జనగామలో జరిగిన సమావేశంలో కూడా కేంద్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. రైతులకు ఎంతో మేలు చేసే ఉచిత కరెంటును కేంద్రం వద్దని చెబుతోందని అన్నారు. ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు.
2023లో రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు తెలంగాణ సెంటిమెంట్ నే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకుంటోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నిరసనలు చేపడుతోంది. టీఆర్ఎస్ ను రెండో సారి అధికారం చేపట్టేందుకు సంక్షేమ పథకాలు ఓ కారణమైతే, బలమైన ప్రతిపక్షం లేకపోవడం మరో కారణం. అయితే వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో బీజేపీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ అంటే బీజేపీకి ప్రేమ లేదనే సందేశాన్ని ప్రజల్లోకి మనస్సుల్లోకి బలంగా చొప్పించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోంది.