టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి కల్వకుంట్ల కవిత గైర్హాజరు కావడంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. కవితను కావాలనే కెసిఆర్ పక్కన పెడుతున్నారనే ప్రచారం అందులో ఒక్కటి.
హైదరాబాద్: కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా మార్చేందుకు ఏర్పాటు చేసిన పార్టీ సర్వసభ్య సమావేశానికి కవిత హాజరు కాలేదు. అంత ముఖ్యమైన సమావేశానికి ఆమె రాకపోవడంతో కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో విభేదాలు చేసుకున్నాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తన గైర్హాజరుపై కవిత వివరణ ఇచ్చారు. తాను ఆయుధ పూజలో ఉండడం వల్ల సమావేశానికి హాజరు కాలేదని ఆమె ట్వీట్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో పాటు 280 మందికి పైగా టిఆర్ఎస్ నాయకులు సమవేశానికి హాజరయ్యారు. దసరా పర్వదినం రోజు జరిగిన పార్టీ సమవేశానికి ముందు కవిత వివిధ జిల్లాల్లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసిన సమావేశానికి కెసిఆర్ తనయుడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు.
undefined
అదే సమయంలో మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో కవితకు ఏ విధమైన బాధ్యత కూడా అప్పగించలేదు. ప్రజాప్రతినిధులందరికీ ఏదో విధమైన బాధ్యతలను కెసిఆర్ అప్పగించారు. కెసీఆర్ స్వయంగా ఓ గ్రామం బాధ్యత తీసుకున్నారు. కెటిఆర్ కూడా ఓ గ్రామం బాధ్యతను తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మర్రిగుడా మండలం బాధ్యతను అప్పగించారు. అయితే కవితను మాత్రం పక్కన పెట్టారు.
నిజానికి, రాజకీయాల్లోకి కవిత అడుగు పెట్టడం కెసిఆర్ కు గానీ కెటిఆర్ కు గానీ మొదటి నుంచీ ఇష్టం లేదని అంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఆమె రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించారని చెబుతారు. అయితే, వారు అందుకు నిరాకరించారనే విషయం ప్రచారంలో ఉంది. అయితే, కవిత వ్యక్తిత్వం చాలా బలమైంది. అంతేకాకుండా విషయంలో అత్యంత వేగంగా అవగాహన చేసుకునే తత్వం కూడా ఆమెకు ఉంది. దీంతో కవిత బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. బతుకమ్మ ఉత్సవాల ద్వారా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. తద్వారా ఆమెను తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లోకి ఆహ్వానించక తప్పలేదని అంటారు.
కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడానికి సిద్ధపడ్డారు. తన వారసుడిగా కెటిఆర్ ను నిలబెట్టడానికి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన, చురుకైన పాత్రను నిర్వహించిన మేనల్లుడు హరీష్ రావును కూడా పక్కన పెట్టేందుకు కెసిఆర్ వెనకాడలేదనే ప్రచారం ఉండనే ఉంది. తప్పని పరిస్థితిలో ఆయన హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వక తప్పలేదని చెబుతారు. కెటీఆర్ కు మార్గం సుగమం చేయడానికే కవితను కూడా నామమాత్రం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి కారణం కూడా కెటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే అనే ప్రచారం కూడా ఉంది.
కెటీఆర్ కు అడ్డం రాకుండా ఉండడానికి అనువుగానే, ముందు జాగ్రత్తతోనే కవితకు క్రియాశీలక పాత్రను ఇవ్వడం లేదని అంటారు. మొత్తం మీద, కవిత బీఆర్ఎస్ ప్రకటన చేసిన సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని చెబుతారు. కవిత విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం ఉందో స్పష్టంగా తెలియదు గానీ ప్రచారం మాత్రం ముమ్మరంగానే సాగుతోంది.