తెలంగాణ రాజకీయాలు: వైఎస్ షర్మిల చేతిలో కోడలు కార్డు

By telugu team  |  First Published Feb 16, 2021, 2:06 PM IST

తెలంగాణలో తన పార్టీకి మద్దతును పొందడానికి వైఎస్ షర్మిల తెలంగాణ కార్డును వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను తెలంగాణ కోడలిని అని, అందువల్ల తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు తనకు ఉందని అంటున్నారు.


తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల అండతో తెలంగాణలో పార్టీని నెలకొల్పాలని భావిస్తున్న వైఎస్ షర్మిలకు ఆంధ్ర కార్డు ఆటంకంగా మారింది. ఇతర ప్రాంతాలవాళ్లు వచ్చి తెలంగాణలో పార్టీని స్థాపించాల్సిన అవసరం లేదనే వాదన కాంగ్రెసు, టీఆర్ఎస్ పార్టీల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ కార్డును వాడడానికి సిద్ధమయ్యారు. 

తెలంగాణ కోడలిగా తనకు తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు ఉందని వైఎస్ షర్మిల అంటున్నారు. షర్మిలవి ఆంధ్ర మూలాలు అని, ఓ లాబీ తిరిగి తెలంగాణలో ఆంధ్ర ఆధిపత్యాన్ని స్థాపించడానికి షర్మిలను ముందు పెడుతున్నారని ఓ వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరితే షర్మిల పార్టీ తెలంగాణలో ముందుకు పోవడం కష్టమే అవుతుంది. 

Latest Videos

undefined

తెలంగాణ సెంటిమెంట్ వ్యతిరేకంగా పనిచేస్తే షర్మిలకు రాజకీయాలు చేయడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యూహాత్మకంగా తెలంగాణ కార్డును ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయ పార్టీ స్థాపనలో భర్త అనిల్ ఆమె వెనక ఉన్నారు. 

షర్మిల ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో ఆమె సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వైఎస్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులూ కార్యకర్తలూ ఆమెకు అండగా నిలిచే అవకాశం ఉంది. 

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. నిజానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా తన వైఖరిని ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ ప్రజల నుంచి అది తొలిగిపోతుందా, మళ్లీ అది రాజుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

click me!