huzurnagar result: హుజూర్‌నగర్‌‌లో ఆర్టీసీ బస్సు ఫెయిల్, కారు జోరుకు కారణం ఇదే..

By telugu teamFirst Published Oct 24, 2019, 10:48 AM IST
Highlights

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె తీరుతెన్నులపై చర్చ ప్రారంబమైంది. హుజూర్ నగర్ ఫలితంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకపోవడానికి కారణలేమిటో చూద్దాం...

ఆర్టీసీ సమ్మె జోరును చూసినవారంతా హుజూర్ నగర్ లో తెరాస ఓటమి పక్కా అనుకున్నారు. కెసిఆర్ వ్యతిరేకులైతే పోలింగ్ కన్నా ముందే కెసిఆర్ ఓటమి చెందాడంటూ సంబరాలు చేసుకున్నారు. సాధారణ ప్రజానీకం కూడా హుజూర్ నగర్ లో గెలుపోటముల కన్నా తెరాస గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేశారు. కానీ దానికి భిన్నంగా అక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి. కారు దూసుకుపోతుంది. 

ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడ్డట్టుగా లేదు. దీనికి అనేక కారణాలు మనకు కనపడుతున్నాయి. ముందుగా మనం ఆర్టీసీ ఉద్యమం సాగిన విధానాన్ని అర్థం చేసుకోవలిసి ఉంటుంది. సమ్మె ప్రారంభమయ్యాక ఆర్టీసీ ఉద్యమ జేఏసీ నేతలు ఎంతసేపటికీ కెసిఆర్ ను గద్దె దించాలి అని అన్నారు తప్ప ఆర్టీసీ ని బ్రతికించాలి అని ప్రధానంగా అనలేదు. 

వారు గనుక ప్రధానంగా ఆర్టీసీ ని పరిరక్షించాలి అని అనుంటే, ప్రజలు ఎంతో కొంత మేర కనెక్ట్ అయ్యేవారు. వారు ఆర్టీసీని బ్రతికించాలి అని అన్నప్పటికీ అది రెండో నినాదంగానే ముందుకెళ్లింది తప్ప ప్రధానంగా ఎక్కడా కనపడలేదు. వారు చేస్తున్న ఉద్యమం అధికార తెరాస కు వ్యతిరేకంగా మాత్రమే ముందుకెళ్లింది. బహుశా ప్రతిపక్షాలు  ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయాలనీ చూసిన ప్రయత్నమేమో. 

ముఖ్యమంత్రులను గద్దె దింపడం అనేటటువంటి మాటలను ఇలాంటి కార్మిక నేతలు అనడం అంత త్వరగా ప్రజలకు రుచించలేదు. కెసిఆర్ ను గద్దె దించితే నెక్స్ట్ ఏంటి అనే దానికి వీరి వాదనల్లో సమాధానం కూడా లేదు. ఒకింత వీరు కూడా రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడారు తప్ప, ఉద్యమ కార్మిక నేతల్లా అనిపించలేదు. 

ఇంతకుముందున్న ముఖ్యమంత్రులను గద్దె దించితే ఆర్టీసీ పరిస్థితి మారలేదు కదా! వాడు పోతే వీడు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకొకరు వస్తారు. కాంగ్రెస్ సర్కార్ పోయింది తెరాస సర్కార్ వచ్చింది. దాని వల్ల ఆర్టీసీ బాగుపడలేదు కదా! అదే వీరు ఆర్టీసీ జిందాబాద్, ఆర్టీసీ పరిరక్షణ అనే ఈ రెండు నినాదాలను మాత్రమే గనుక ముందుకెత్తుకొని వెళ్లగలిగితే ప్రజల్లోకి వెళ్ళేది తప్ప, ఇటువంటి రాజకీయ నినాదాలు ఆర్టీసీ కార్మికులకు అంతగా లాభించినట్టుగా లేవు. 

మరో అంశం ప్రజల్లోకి తమ ఉద్యమాన్ని తీసుకెళ్లడం. వీరు ఉద్యమం చేస్తున్నారు మీడియాలో కనపడుతున్నారు తప్ప ప్రజలకు వారి డిమాండ్లు ఏంటో తెలియపరచడంలో విఫలమయ్యారు. "చర్చకు మా కండక్టర్ ను పంపిస్తాం కెసిఆర్ నువ్వు సిద్ధమా?" అంటూ సవాల్ విసిరారు తప్ప, అసలు తమ డిమాండ్లు ఏమిటో ఎందుకు సమ్మె చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన ఉద్యమ రూపాలైన వంటా వార్పు,భిక్షాటన తదితరాలను వీరు వాడారు తప్ప వాటి నుండి వీరు లాభం పొందలేకపోయారు. వంట వార్పు పేరిట వండారు తిన్నారు తప్ప ప్రజలకు తమ గోడు ని వెళ్లబోసుకోవడంలో విఫలమయ్యారు. 

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఎందుకు సహేతుకమైనవో కనీసం వారి చుట్టాలకన్నా చెప్పే ప్రయత్నం చేశారో లేదో! అదే ఈ కార్మికులు గనుక వారి కుటుంబాలతో సహా బయటకొచ్చి ఇంటింటికి వాడ వాడాలా తిరుగుతూ ప్రజలకు తమ డిమాండ్లు ఏంటి, ఎందుకు అడుగుతున్నాము,ఆర్టీసీ వల్ల ప్రజలకు కలిగే లాభాలు, ఆర్టీసీ పరిరక్షణ కోసం కేవలం కార్మికులే కాకుండా ప్రజలందరూ ఎందుకు ఉద్యమించాలి గనుక చెప్పి ఉంటే ఉద్యమం ప్రజల్లోకి వెళ్లి ఉండేది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇలాంటి ఉద్యమ రూపకాలు వాడాడు కానీ, బలంగా తెలంగాణ ఎందుకోసం కావాలో చెప్పాడు. ప్రజలంతా కెసిఆర్ వెంట నడిచారు. ప్రతి తెలంగాణ పౌరుడికి ఎలానో కరెక్ట్ గా తెలియకున్నా, తెలంగాణ వస్తే మాత్రం లాభం కలుగుద్ది అని నమ్మాడు. కెసిఆర్ ఆ నమ్మకాన్ని కలిగించాడు. ఈ విషయంలో ఆర్టీసీ నాయకత్వం విఫలమయ్యింది. 

కెసిఆర్ తన స్పీచుల్లో తెలంగాణ రావడం మా ధ్యేయం అన్నాడు తప్ప రోశయ్య సర్కారునో, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారునో కూలదోయమని అనలేదు. "ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా" అని నినాదం ఇచ్చాడే తప్ప, ఏ ఒక్కరిని నేరుగా టార్గెట్ చేసి వారిని గద్దె దింపాలని అనలేదు. 

ఆర్టీసీ కార్మికులు నేరుగా కెసిఆర్ ను టార్గెట్ చేసి తిడుతుంటే సాధారణ ప్రజానీకానికి ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ మీద పడిపోతున్నారో అర్థం కాలేదు. తమకు రైతుబంధు,పెన్షన్లు, కల్యాణ లక్ష్మి వంటి నజరానాలు ఇస్తున్న కెసిఆర్ ను తిడుతుంటే ఒకింత ప్రజలు వ్యతిరేకించారు కూడా. ఇలాంటి ప్రజల్లో స్పందన కలిగించాలంటే వీరు  తమ డిమాండ్లు సమ్మతమైనవే అని ప్రజలను ఒప్పించగలగాలి. అప్పుడు మాత్రమే వారు కదులుతారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ విషయంలో కెసిఆర్ సక్సెస్ అయ్యాడు. టీడీపీ,కాంగ్రెస్ వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఎదుర్కొంటూ వారి క్యాడర్ ని కూడా తెలంగాణ డిమాండ్ విషయంలో ఒప్పించగలిగారు. సబ్బండ వర్గాల ప్రజలను తన వెంట నడిపించుకోగలిగారు. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు పూర్తిగా విఫలమయినట్టుగా మనకు కనపడుతుంది.  

ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు వారి ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోతే సబ్బండవర్గాల ప్రజల మద్దతును సంపాదించలేరు.  

click me!