బిజెపిలోకి ఈటెల అనుమానమే: ఆత్మగౌరవ పోరాటమే, భార్య సంకేతాలు

By telugu teamFirst Published May 30, 2021, 12:21 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనుమానంగానే కనిపిస్తోంది. ఆయన సతీమణి జమున చేసిన ప్రకటన వల్ల ఆ అనుమానం తలెత్తుతోంది. ఆయన ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనుమానంగానే కనిపిస్తోంది. ఆదివారంనాడు ఆయన సతీమణి జమున మాట్లాడిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 2వ తేదీన ఆయన కమలం గూటికి చేరుకోవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది నిర్ధారణ కాలేదు. 

బిజెపిలో చేరితే ఈటెల రాజేందర్ ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కునే అవకాశం ఉంది. ఒక్కటి  అక్రమాల నుంచి తప్పించుకోవడానికి బిజెపిలో చేరారనే ప్రచారం ముమ్మరమవుతుంది. అక్రమాలు చేశారు కాబట్టే బిజెపిలో చేరి, వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయనపై ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది. ఇది ఆయన రాజకీయ జీవితంపైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇక రెండోడి... ఈటెల రాజేందర్ బిజెపిలో చేరితే ఆయన నుంచి ప్రధానమైన వర్గం ఒక్కటి దూరమయ్యే అవకాశం ఉంది. అది కేవలం కుల ప్రాతిపదికపై ఏర్పడిన వర్గం కాదు. తెలంగాణలోని ప్రగతిశీల శక్తులుగా ముద్ర పడిన ఓ వర్గం ఆయనకు దూరం జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు పెద్ద యెత్తునే ఉన్నారు. ఈ స్థితిలో ఒక వర్గం ప్రజలు కేసీఆర్ కు ప్రత్యామ్నాయాన్ని ఆశిస్తున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత, హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన తర్వాత బిజెపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని భావించారు. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లోనూ బిజెపి ఏ విధమైన సానుకూలమైన ఫలితాలను సాధించలేకపోయింది.  పైగా, కేసీఆర్ ను ఎదుర్కునేందుకు బిజెపి సిద్ధంగా లేదనే అభిప్రాయం కూడా బలపడుతూ వస్తోంది. 
ప్రభుత్వంపై కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్న కారణంగా ఆ అభిప్రాయం పెరుగుతూ వస్తోంది.  

ఈ పరిస్థితుల్లో బిజెపిలో చేరితే కనుక ఈటెల రాజేందర్ తప్పులు చేశాడనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే బిజెపిలో చేరే విషయంపై ఆయన పునరాలోచన చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక జరిగితే తనను బలపరచాలని కోరడానికే ఇంత వరకు వివిధ పార్టీల నాయకులను ఈటెలా రాజేందర్ కలుస్తూ వచ్చారు. ఆయన సొంత పార్టీ పెట్టాలనే అభిప్రాయం కూడా ఓ వర్గంలో బలంగా ఉంది.

ఈ స్థితిలో జమున మీడియా సమావేశంలో చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని తాను కోరుతున్నానని, అందుకు తన ఆస్తులన్నీ అమ్మి ఖర్చు పెడుతానని ఆమె అన్నారు. ఉద్యమం కోసం తమ ఆస్తులను అమ్ముకుంటూ వచ్చామని, ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటం కోసం ఉన్న ఆస్తులను కూడా విక్రయించి ఈటెల రాజేందర్ కు ఇస్తానని ఆమె చెప్పారు. అన్ని ఆస్తులు పోయినా తిరిగి నిలబడగలమనే ధైర్యం తనకు ఉందని ఆమె చెప్పారు. అందువల్ల ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనుమానంగానే అనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవ నివానదంతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నోట్: తెలంగాణ సీఎం కేసీఆర్ కొట్టే ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడడం కష్టమని భావిస్తే మాత్రం ఈటెల రాజేందర్ బిజెపిలో చేరే అవకాశాలు లేకపోలేదు.

click me!