తెలంగాణలో 'షాక్' కొడుతున్న 'కరెంట్' రాజకీయం.. పేటెంట్ తమదే అంటున్న కాంగ్రెస్..!

By Asianet News  |  First Published Jul 12, 2023, 5:20 PM IST

తెలంగాణలో ప్రస్తుతం ‘‘పవర్’’ రాజకీయం నడుస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన రాజకీీయ దుమారమే ఇందుకు కారణం.


తెలంగాణలో ప్రస్తుతం ‘‘పవర్’’ రాజకీయం నడుస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన రాజకీీయ దుమారమే ఇందుకు కారణం. అమెరికా పర్యటిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. మంత్రి కేటీఆర్‌‌తో సహా ఇతర ముఖ్య నేతలు రేవంత్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు దిగుతున్నాయి. 

రేవంత్ వ్యాఖ్యలతో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ వైఖరి వెల్లడైందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తుంది. నిన్న ధరణి తీసేస్తామని అన్నారని.. ఇప్పుడు ఉచిత కరెంట్ లేకుండా చేస్తామని అంటున్నారని బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు.. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. మొత్తానికి రైతులకు ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ వ్యతిరేకమనే వాదనను తీసుకొచ్చారు. మరో కొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో.. దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Latest Videos

undefined

అయితే దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతుంది. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి నిరాశకు లోనైనా బీఆర్ఎస్ నేతలు ఈ విధమైన అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రేవంత్ వీడియోను కూడా కట్ చేసి పోస్టులు చేస్తారనే.. వీడియో పూర్తిగా చూస్తే రేవంత్ మాట్లాడిన ఉద్దేశం ఎవరికైనా అర్థం అవుతుందని చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ గురించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేలా బీఆర్ఎస్ దుష్ప్రచారానికి పాల్పడుతుందని వారు మండిపడుతున్నారు. 

దీంతో తెలంగాణ పాలిటిక్స్  ప్రస్తుతం ‘‘కరెంట్’’ షాక్ కొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఉచిత విద్యుత్‌పై  పేటెంట్ తమదేనని చెబుతున్నారు. సీఎల్పీ  నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అసలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ అని చెప్పారు. పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారని చెప్పారు. అప్పుడే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రారంభం అయిందని తెలిపారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 

కాంగ్రెస్‌ ప్రారంభించిన ఉచిత విద్యుతునే.. బీఆర్ఎస్‌ కొనసాగిస్తుందని విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని కూడా ఆరోపణలు  చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు రెట్టింపు కేటాయింపులు ఉంటాయని కూడా చెబుతున్నారు. ఈ విధంగా ఉచిత విద్యుత్‌పై పేటెంట్  తమదేనని కాంగ్రెస్ వాదిస్తోంది. 

click me!