రేవంత్ సెల్ఫ్ గోల్?.. పొంగులేటి వైపు హైకమాండ్ మొగ్గు!

By Mahesh KFirst Published Jul 16, 2023, 9:02 PM IST
Highlights

రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులను సృష్టించాయి. టీపీసీసీ చీఫ్ దుందుడుకు వ్యాఖ్యలతో పార్టీకి మైలేజ్ రాకపోగా.. ఉన్న సానుకూల వాతావరణాన్ని కూడా చెడగొట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలోకి కొత్తగా చేరిన పొంగులేటికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఇస్తుండటం చర్చనీయాంశమవుతున్నది.
 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అమెరికాలో ఉచిత కరెంట్ పై చేసిన కామెంట్లతో ఈ చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు ఏ మేరకు ప్రయోజనం తెచ్చి పెడుతున్నాయో తెలియదు కానీ, ఇటు టీపీసీసీ నేతలు, అటు హైకమాండ్ నేతలూ కవర్ చేయడానికే సరిపోతున్నారనే వాదనలు వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయనే సూచనలు హైకమాండ్‌కు వెళ్లినట్టు అర్థం అవుతున్నది. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రతీది దగ్గరగా పర్యవేక్షిస్తున్నది. ఎలాగైనా తెలంగాణలో గెలవాలన్న కాంగ్రెస్ లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే నీరుగార్చేలా ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పొంగులేటిపై ఆశలు పెంచుకున్నట్టు తెలుస్తున్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత పెంచినట్టు కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నది.

సాధారణంగా టీపీసీసీ చీఫ్ స్వయంగా చాలా వరకు నిర్ణయాల్లో కీలకంగా ఉండేవారు. రేవంత్ రెడ్డి వచ్చాక.. మరీ ఈ మధ్య కాలంలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టానమే తీసుకుంటున్నది. రేవంత్ రెడ్డికి నిర్ణయాధికారం చాలా వరకు కోత పెట్టినట్టు తెలుస్తున్నది. 

ఇదిలా ఉండగా, కొత్తగా చేరిన పొంగులేటికి కీలకమైన ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రచార కమిటీ కూర్పును కాంగ్రెస్ ఆచితూచి చేసింది. పొంగులేటి పై నమ్మకంతో ఆయనకు అందులో స్థానం దక్కిందని తెలుస్తూనే ఉన్నది. తెలంగాణలో గెలుపోటముల్లో నిర్ణయాత్మ పాత్ర పోషించే, ఆర్థికంగా బలమైన కమ్యూనిటీకి చెందిన పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా ప్రాధాన్యత పెంచుతున్నది. ఇది రేవంత్ రెడ్డి తన నోటితో తనకే పెట్టుకున్న చెక్‌గా కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలనే కసితో కాంగ్రెస్‌లో పొంగులేటి చేరారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి రాష్ట్రం నుంచి కేంద్రం వరకు రాజకీయంగా, వ్యాపారంగా సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనూ నేతలందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూసిన ఆయనకు కేసీఆర్‌తోపాటు, బీఆర్ఎస్ పార్టీ లోటుపాట్లు చాలా వరకు అంచనా వేసే అవకాశం, సామర్థ్యం ఉన్నది. కేసీఆర్ వ్యూహాలు పూర్తిగా తెలిసిన నేతగా పొంగులేటిని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. కేసీఆర్ వ్యతిరేకులను కూడగట్టడంలోనూ ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. అదీగాక, ఖమ్మం జిల్లాలో ఆయనకు బలమైన పట్టు ఉన్నది. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత దూకుడు పెంచారు. చాలా వరకు ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి వివాదాస్పద తీరు, శృతిమించిన దూకుడు, సీనియర్లతో ఆయన ప్రవర్తన వంటివి హైకమాండ్‌కు ఆయనపై కొంత ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇలా పొంగులేటికి పెరుగుతున్న ఆదరణ, కలిసొస్తున్న అంశాలు పరోక్షంగా రేవంత్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

click me!