ఎన్డీఏ భేటీకి జనసేన.. సంబరపడుతున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు.. లాజిక్ ఇదే..!!

By Asianet NewsFirst Published Jul 16, 2023, 2:41 PM IST
Highlights

ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న ఓ పరిణామం మాత్రం అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ క్యాడర్‌ను సంబరపడేలా చేస్తోంది. అదేమిటంటే.. ఏన్డీఏ మిత్ర పక్షాల సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం అందడమే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలో నిలుస్తామని అధికార వైసీపీ పలు సందర్భాల్లో క్లియర్‌గా చెప్పింది. అయితే విపక్ష పార్టీలు ఏ విధంగా ముందుకు సాగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తాయా? టీడీపీని కూడా తమతో పాటు కలుపుకుని వెళ్తాయా? బీజేపీకి కూడా జనసేన దూరమవుతుందా? అనే ప్రశ్నలకు సమీప భవిష్యత్తులోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న ఓ పరిణామం మాత్రం అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ క్యాడర్‌ను సంబరపడేలా చేస్తోంది. అదేమిటంటే.. ఏన్డీఏ మిత్ర పక్షాల సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం అందడమే. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల  మనోహర్ హాజరుకానున్నారు. అయితే రాష్ట్ర ప్రజల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. రాష్ట్రానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దగా ఆర్థిక సహాయం అందించడం లేదని ప్రజలు నమ్ముతున్నారు. 

అయితే ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందుతుందని.. రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారం  కొంత వైసీపీ క్యాంపును కలవరానికి గురిచేశాయి. ఎందుకంటే.. మూడు పార్టీలు కలిసి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండదు. అందుకే వైసీపీ నేతలు పదే పదే.. ఒంటరిగా రావాలని జనసేన, టీడీపీ శ్రేణులకు సవాలు చేస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ  కూటమికి హాజరయ్యేందుకు టీడీపీకి ఆహ్వానం అందకపోవడంతో.. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉండబోదని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. దీంతో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి తమకు కలిసివచ్చే అంశం అవుతుందని.. ఆ పార్టీ వర్గాల్లో అంతర్గత సమావేశాల్లో సంబరపడుతున్నారు. 

ఇక, టీడీపీ విషయానికి వస్తే.. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం ఆ పార్టీలో కొందరికి నచ్చడం లేదు. ఒంటరిగా వెళ్లినా టీడీపీ గెలుస్తుందని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందు.. బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగాలనేది చంద్రబాబు ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల పొత్తులపై మాట్లాడి తాను చులకన కాలేనని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ  ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని కూడా తెలిపారు. 

తాజాగా ఇప్పుడు కేవలం ఎన్డీఏ సమావేశానికి జనసేనకు మాత్రం ఆహ్వానం అందడం.. టీడీపీకి ఆహ్వానం అందకపోవడంతో పొత్తులను వ్యతిరేకిస్తున్న  నేతలు, కార్యకర్తలు సంబరపడుతున్నారు. టీడీపీ ఒంటరిగా వెళ్లినా ఈ సారి విజయం సాధిస్తుందని.. బీజేపీని కలుపుకుంటే మైనారిటీల ఓటు బ్యాంకు దూరం కావడంతో పాటు, ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. పొత్తులు ఉంటే.. కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని.. ఇలా చేస్తే అక్కడ పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నవారికి అన్యాయం జరిగినట్టుగా అవుతుందని పేర్కొంటున్నారు.  బీజేపీతో జనసేన కలిసి వెళ్తే కూడా అది తమకు లాభిస్తుందనే వాదనను తీసుకొస్తున్నారు. 
 

click me!