బోండా ఉమకు చంద్రబాబు షాక్: పంతం నెగ్గించుకున్న కేశినేని నాని

By telugu team  |  First Published Mar 4, 2021, 8:55 PM IST

విజయవాడ మేయర్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని పంతం నెగ్గించుకున్నారు. కేశినేని నాని కూతురు శ్వేతను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ టీడీపీ నాయకత్వం నుంచి ప్రకటన వెలువడింది.


విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ కేశినేని నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు. శ్వేత, కేశినేని నాని కుమారై. 11వ డివిజన్ నుంచి ఆమె కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు శ్వేత టీడీపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. 

విజయవాడ కార్పొరేషన్‌ను టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తప్పుబట్టారు. ప్రభుత్వం సహకరించకున్నా వరల్డ్‌ క్లాస్‌ సిటీగా మారుస్తానని కేశినేని శ్వేత ప్రకటించారు. ఇటీవల విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా శ్వేతను ఖరారు చేస్తారనే ప్రచారం జరిగింది. 

Latest Videos

undefined

అయితే శ్వేత అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యే బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. 

అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేరారని మరో వాదం వినిపిస్తోంది. అయితే విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 14న ఎన్నికలు నిర్వహిస్తారు. 14న ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో విజయవాడతో పాటు విజయనగరం, విశాఖ, మచిటీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.

click me!