అచెన్న వార్నింగ్: జగన్, చంద్రబాబులపైకి సోము వీర్రాజు అస్త్రం

By telugu teamFirst Published Feb 4, 2021, 5:47 PM IST
Highlights

తనను అరెస్టు చేసిన సమయంలో టీడీీప ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆ హెచ్చరికను బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాలకు కొత్త కోణం ఇవ్వడానికి వాడుకున్నారు.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పోలీసులకు చేసిన హెచ్చరిక బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేతికి అస్త్రాన్ని అందించింది. ఆ అస్త్రాన్ని ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబుపైకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదికి ఎక్కుపెట్టారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారనే కేసులో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,  తాను తమ పార్టీ చీఫ్ చంద్రబాబును ఒప్పించి హోం మంత్రిత్వ శాఖను తీసుకుంటానని, అప్పుడు తప్పుడు కేసులు బనాయించిన పోలీసుల అంతు చూస్తానని ఆయన అన్నారు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడమనేది కల్ల అని వారు చెప్పారు. 

కానీ, రాజకీయాలను ఓ మలుపు తిప్పడానికి లేదా ఏపీ రాజకీయాలకు ఓ కొత్త కోణాన్ని అందించడానికి దాన్ని సోము వీర్రాజు వాడుకున్నారు. అచ్చెన్నాయుడు హోం మంత్రిని అవుతానని అంటున్నారని ఆయన గుర్తు చేస్తూ చంద్రబాబుకు, లోకేష్, చంద్రబాబు భార్యకు, కోడలికి ఆయన హోం మంత్రి అవుతారని, ఆ కటుంబం హోం (ఇంటి) మంత్రి అవుతారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా హోం మంత్రి ఉన్నారని, పోలీసులు అధికారులనైనా బదిలీ చేయించగలిగారా అని ఆయన అన్నారు. హోం మంత్రి అయినా కూడా అచ్చెన్నాయుడి చేతిలో అధికారం ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు.

ఏపీలో బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన అడిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆ దమ్ము ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీలు బీసీని ముఖ్యమంత్రిని చేయలేవని, చేయబోవని అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే చంద్రబాబు ఆశీస్సులతో ఆయన కుమారుడు లోకేష్ అవుతారు. వైసీపీ మళ్లీ గెలిస్తే జగన్ మాత్రమే సీఎంగా ఉంటారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. దాన్నే సోము వీర్రాజు గుర్తు చేస్తూ తనదైన శైలీలో సవాల్ విసిరారు. 

click me!