జగన్ ను చిక్కుల్లోకి నెడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

By Sree SFirst Published Jun 11, 2020, 9:22 AM IST
Highlights

తొలుత తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్టు ఉత్తర్వులను జారీచేసిన రమేష్ కుమార్... ఆ తరువాత తిరిగి వాటిని వెనక్కి తీసుకున్నారు. ఎలాగైతే వైసీపీ ప్రభుత్వం తీర్పులోని ఉన్న వ్యాఖ్యానాల ఆధారంగా వ్యవహరించిందో... ఇప్పుడు రమేష్ కుమార్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో... హై కోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీమ్ నిరాకరించింది. దీనితో రమేష్ కుమారే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కొనసాగవచ్చని దాని అర్థం. స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులిచ్చింది. 

రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలేమిటని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కారుకు అక్కడ చుక్కెదురైనా సంగతి తెలిసిందే. 

హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.... రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని హెచ్చరించింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారని నిలదీసింది. దీన్ని దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించింది.

తొలుత హై కోర్టు, ఆ తరువాత సుప్రీమ్ కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ... హుందాగా ప్రవర్తించాల్సిన ప్రభుత్వం మాత్రం అలా కాకుండా సుప్రీమ్ తీర్పుకి మరో కొత్త  భాష్యం చెబుతున్నాయి. 

నోటీసులకు బదులివ్వడానికి రెండు వారల గడువు ఇచ్చినందున, అంతలోపల ఆయనను నియమించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఒక వేళ రమేష్ కుమార్ నియామకాన్ని రెండు వారాలపాటు నిలువరించాలి అనుకుంటే... ఏకంగా రెండు వారల స్టే సుప్రీంకోర్టు విధించేది కదా! ఈ లాజిక్ ను ప్రభుత్వం ఇక్కడ మిస్ అవుతుంది. 

ఇక ఈ పరిణామాలతో విసుగుచెందిన రమేష్ కుమార్ సైతం న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వ పద్దతిలోనే వారికి కౌంటర్ ఇవ్వడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలియవస్తుంది. హై కోర్టు తీర్పు ఆయనను కొనసాగించమని చెప్పింది. సుప్రీమ్ కూడా ఒకరకంగా అదే తీర్పును సమర్థించింది. 

తన తీర్పులో హై కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమించాలని చెప్పింది. ఆయన విధుల్లో చేరబోతుంటే..ప్రభుత్వం తరుఫున ఏజీ మాట్లాడుతూ... ఆయనను ప్రభుత్వం నియమించాలని, హై కోర్టు  తన తీర్పులో కూడా అదే  చెప్పిందని, ఆయనంతట ఆయన ఎలా వెళ్లి చేరతారు అని ప్రశ్నించింది. 

తొలుత తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్టు ఉత్తర్వులను జారీచేసిన రమేష్ కుమార్... ఆ తరువాత తిరిగి వాటిని వెనక్కి తీసుకున్నారు. ఎలాగైతే వైసీపీ ప్రభుత్వం తీర్పులోని ఉన్న వ్యాఖ్యానాల ఆధారంగా వ్యవహరించిందో... ఇప్పుడు రమేష్ కుమార్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 

హై కోర్టు తీర్పులో ప్రభుత్వం ఆయనను నియమించాలని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం అంటే.... మంత్రి మండలి అని ప్రత్యేకించి చెప్పనందున గవర్నర్ ని వెళ్లి కలిసి ఆయన ద్వారా విధుల్లో చేరాలని చూస్తున్నారు. 

ఎన్నికల కమీషనర్ అన్న పదవి రాజ్యాంగబద్ధమైన పదవి, దానికితోడుగా రాష్ట్రప్రభుత్వానికి అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటో స్వయంగా సుప్రీమ్ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన గవర్నర్ ద్వారా ఈ పోస్టులో తిరిగి చేరేందుకు సన్నాహాలను చేసుకుంటున్నట్టు తెలియవస్తుంది. 

ఆయన గవర్నర్ ని నేడు కలవనున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఇన్నిరోజులుగా ఆ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించేది గవర్నర్ అయినందున ఆయననే వెళ్లి కలిసి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ విధుల్లో చేరాలని ఆయన  భావిస్తున్నారట. 

దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి. సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను మలుచేస్తారు. ప్రభుత్వ మంత్రి మండలి నియమాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

తాను ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరిస్తానని అంటారా... లేదంటే తన విచక్షణాధికారాలను ఉపయోగించి తాను ఇక్కడ ఎటువంటి నియామకాలను చేయడంలేదు, కేవలం న్యాయస్థానం తీర్పుకు లోబడి మాత్రమే వ్యవహరిస్తున్నాను అంటారా వేచి చూడాల్సిన అంశం. 

click me!