రోడ్డెక్కిన గాంధీ వైద్యులు: కరోనాపై పోరులో బయటపడుతున్న తెలంగాణ ప్రభుత్వ డొల్లతనం

By Sree SFirst Published Jun 10, 2020, 5:00 PM IST
Highlights

నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా మృతుడి బంధువుల దాడి అనంతరం వారు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక విషయాలు తెరమీదకు వచ్చాయి. వారంతా కేసీఆర్ ఇక్కడకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రం మాత్రం అన్ని రాష్ట్రాలు ఒకవైపు తాము మాత్రం ఒకవైపు  అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను పొట్టనబెట్టుకుంటుంటే... ప్రభుత్వం మాత్రం తమ పంథాను మార్చుకునేలా కనబడుతుంది. 

తాజాగా నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా మృతుడి బంధువుల దాడి అనంతరం వారు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక విషయాలు తెరమీదకు వచ్చాయి. వారంతా కేసీఆర్ ఇక్కడకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు రోడ్డెక్కడంతో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

వైద్యులకు ఇవ్వాల్సిన పీపీఈ కిట్ల నుండి మొదలు రాష్ట్రంలో కరోనా పరీక్షల వరకు అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు సంధిస్తున్న ప్రశ్నలు రాష్ట్రప్రభుత్వ విధానాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. 

ప్రధానంగా తెలంగాణాలో టెస్టింగుల విషయం. తెలంగాణాలో టెస్టింగులు తక్కువ ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి నుండి మొదలుకొని హై కోర్టు వరకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో తలంటారు. 

డాక్టర్లు కూడా ఇదే విషయం డిమాండ్ చేస్తున్నారు. తమకు కూడా టెస్టులు నిర్వహించడంలేదని వారు వాపోతున్నారు. తాము ఒక్కరోజు దాదాపుగా 100 నుంచి 200 మంది రోగులను ఓపీ వార్డులో చూస్తామని, తమకు గనుక కరోనా ఉంటె... ప్రజలను రక్షించాల్సిన తామే వారికి వ్యాప్తిచేసినవారమవుతామని వారు వాపోతున్నారు. 

జూడాల సంఘం అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ.... అంతేకాకుండా తమకు టెస్టులు గనుక నిర్వహించకుంటే... తాము కరోనా బారినపడడమే కాకుండా తమ కుటుంబసభ్యులు కూడా ఈ వైరస్ బారినపడతారని అంటున్నారు. తమకు ఎక్కడైనా వసతి కల్పించాలని కోరుతున్నప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఆదిశగా ప్రయత్నం కూడా చేయలేదని వారు వాపోతున్నారు. 

ఇక మరో అంశం రాష్ట్రం మొత్తానికి ఒకటే కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి ఉండడం. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వికేంద్రీకరించి కరోనా వైరస్ కి చికిత్స అందిస్తూ ఉంటే... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం గాంధీ ఆసుపత్రిని ఒక్కదాన్నే కరోనా వైరస్ ట్రీట్మెంట్ కి కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచినా కేరళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ వికేంద్రీకరించి చికిత్సను అందిస్తుంటే... తెలంగాణాలో గాంధీ ఒక్క ఆసుపత్రిని మాత్రమే చికిత్సకోసం వినియోగించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఇక మరో అంశం ఫై పీపీఈ కిట్లు. తమకు ఇచ్చే కిట్ల క్వాలిటీ నాసిరకంగా ఉంటుందని, అవి అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో లేవని వారు అంటున్నారు. ఆ పీపీఈ కిట్లను ధరించిన తరువాత అందులో చెమట ఎక్కువగా పోయడం వల్ల ఎందరో డాక్టర్లు కళ్ళు తిరిగి పడిపోతున్నారని వారు అంటున్నారు. 

ఇక తామంతా పిజి చదువుతున్న విద్యార్థులమని, తమలో చాలామంది కరోనా వైరస్ బారిన పడ్డప్పటికీ... ప్రభుత్వం వారు మాత్రం పరీక్షలను నిర్వహించాలనే మొండి పట్టుదలతో ఉన్నారని వారు వాపోతున్నారు. తమలో అందరూ కరోనా పై పోరులో నిమగ్నమై ఉండగా, కరోనా వైరస్ సోకి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలా ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు అంటున్నారు. 

ఇక మరో అంశం.... తమపైనే ఆసుపత్రుల్లో దాడులు. తాము శక్తివంచనలేకుండా ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటే... తమపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఆ దాడులను ఆపడంలో విఫలమవుతున్నారని వారు అంటున్నారు. ఐసీయూలోకి వచ్చిమరీ దాడులు పాల్పడుతుంటే... తామెలా విధులు నిర్వర్తించగలమని వారు అంటున్నారు. 

click me!