ఎపిలోని తాజా ఎమ్మెల్సీ ఫలితాలు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యూాహాలను దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. తన బలంతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచి పొత్తులో భారీ వాటా పొందాలనే పవన్ ఆశలు గల్లంతయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నే దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. జగన్ కు ఆ ఫలితాలు ఎలాగూ మింగుడు పడవు. కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం ఎదురుదెబ్బనే అని చెప్పాలి. ఓ వైపు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు మునుపటిలా పవన్ కల్యాణ్ తో దోస్తీ కోసం అర్రులు చాచకపోవచ్చు. అలాగే, పవన్ కల్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు మండిపడుతున్నారు.
బిజెపి ఉత్తరాంధ్రలో తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ (టిడిపి) మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటైన ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే అనే సంకేతాలను ప్రజలను ఇచ్చారని భావిస్తున్నారు. టిడిపికి తమ పొత్తు అనివార్యమనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ భావిస్తూ వచ్చారని అంటున్నారు. అందుకే, పొత్తు గౌరవప్రదంగా ఉండాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సీట్ల పంపకంలో సమాన భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో ఆత్మవిశ్వాసం పెరిగిందనే భావించవచ్చు. దాంతో పవన్ కల్యాణ్ పెట్టే షరతులకు చంద్రబాబు అంగీకరించకపోవచ్చునని అంటున్నారు.
undefined
తమతో పొత్తు పెట్టుకోవాలంటే జనసేన దిగిరాక తప్పదని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. ఎమ్మెల్సీ ఫలితాలతో పవన్ కల్యాణ్ మీద చంద్రబాబు పైచేయి సాధించారని చెప్పవచ్చు. అందువల్ల పొత్తు పెట్టుకోవాల్సి వస్తే పవన్ కల్యాణ్ తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అదే సమయంలో బిజెపి నాయకత్వం నుంచి కూడా పవన్ కల్యాణ్ విమర్శలను ఎదుర్కుంటున్నారు.
బిజెపి సీనియర్ నేత మాధవ్ పవన్ కల్యాణ్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపిని ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారే తప్ప బిజెపిని గెలిపించాలని చెప్పలేదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ తమకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన అన్నారు. అంతకు ముందు ఇటీవల బిజెపి రాష్ట్ర నాయకత్వంపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బిజెపి రాష్ట్ర నాయకత్వం తనతో కలిసి రావడం లేదని, వైసిపిపై ఉమ్మడి పోరాటానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తాను చెప్పినట్లు వైసిపికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనే మాట అనేవాడిని కాదని ఆయన చెప్పారు. అయితే, తాజా ఎమ్మెల్సీ ఫలితాలు పవన్ కల్యాణ్ కు ఎదురు తిరిగాయి. బిజెపి నాయకులు ఆయనపై ఎదురుదాడికి దిగారు. తాజా ఎన్నికల ఫలితాలు పవన్ కల్యాణ్ ఎత్దుగడలను దెబ్బ తీసినట్లే భావించాల్సి ఉంటుంది.