మోడీ కేబినెట్ విస్తరణ: టార్గెట్ 2024 ఎన్నికలు

By team teluguFirst Published Jul 8, 2021, 12:16 AM IST
Highlights

విస్తరణకు కేవలం కొన్ని నిమిషాల ముందు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ ల రాజీనామా రాజకీయ పండితులను సైతం షాక్ కి గురిచేసింది. మొత్తంగా 12 మంది మంత్రులు రాజీనామా చేయడం, వారి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించడం అన్ని కూడా విస్తరణకు ముందు చకచకా జరిగిపోయాయి.

నేటి మోడీ కేబినెట్ విస్తరణను చూసిన ఎవ్వరైనా అవాక్కవ్వడం తథ్యం. విస్తరణకు కేవలం కొన్ని నిమిషాల ముందు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ ల రాజీనామా రాజకీయ పండితులను సైతం షాక్ కి గురిచేసింది. మొత్తంగా 12 మంది మంత్రులు రాజీనామా చేయడం, వారి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించడం అన్ని కూడా విస్తరణకు ముందు చకచకా జరిగిపోయాయి. ఈ విస్తరణ తర్వాత మోడీ కేబినెట్ లో మొత్తంగా 77 మంది మంత్రులు కొలువుదీరారు. వీరిని గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. మొదటిది 2024 ఎన్నికలు కాగా, మరొకటి మోడీ మార్కు. 

విస్తరణకు ముందు ఈసారి కేబినెట్ లోకి తీసుకునే వారిలో చదువుకున్న వారికి మేధావులకి ప్రాధాన్యతనివ్వనున్నారనే వార్త బయటకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి అందిన నూతన మంత్రుల ప్రొఫైల్స్ లో వారి అకాడమిక్ బ్యాక్ గ్రౌండ్ ని వారి సేవలను హైలైట్ చేసారు. పూర్తి కేబినెట్ లోని పేర్లను గనుక పరిశీలిస్తే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కాబినెట్ విస్తరణలో మార్పులు చేశారనే విషయం స్పష్టమైపోతుంది. 

ప్రస్తుతం నరేంద్ర మోడీ కేబినెట్ లో 27 మంది ఓబీసీ మంత్రులు,షెడ్యూల్డ్ కులకు చెందిన 12 మంది,షెడ్యూల్డ్ తెగలకు చెందిన 8 మంది, మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులు,11 మంది మహిళా మంత్రులు ఉన్నారు. మొత్తంగా 77 మందిలో 48 మంది అగ్రకులాలకు చెందిన వారు కాకపోవడం గమనార్హం. కేవలం 29 మంది మాత్రమే వివిధ ప్రాంతాల్లోని వివిధ అగ్రకులాలకు చెందిన మంత్రులు మాత్రమే ఉన్నారు. అగ్రకులస్థుల పార్టీగా బీజేపీకి ఉన్న పేరును తొలగించుకునే ప్రయత్నం మాత్రం బలంగా చేసినట్టు కనబడుతుంది. 

ఇక కేబినెట్ విస్తరణ తరువాత మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఎదురవనున్న తొలి సవాలు ఉత్తరప్రదేశ్ ఎన్నిక. దేశంలో అధికారం చేపట్టాలంటే ఉత్తరప్రదేశ్ కీలకం. ప్రస్తుత కేబినెట్ లో యూపీ నుంచి 14 మంది మంత్రులు కొలువుదీరారు. నేడు ప్రమాణస్వీకారం చేసిన ఏడుగురిలో కూడా ముగ్గురు ఓబీసీలు కాగా, మరో ముగ్గురు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు. కేవలం ఒక్కరే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. ప్రాంతాల వారీగా కూడా ఉత్తరప్రదేశ్ లోని ప్రతి ప్రాంతంలోనూ తమ పట్టును నిలుపుకునేలా ఈ ఎంపిక చేసినట్టుగా అవగతమవుతుంది. అప్నా దళ్ కి చెందిన అను ప్రియా పటేల్ నుండి మొదలుకొని పంకజ్ చౌదరి వరకు అందరి పేర్లను ఇందుకు తగ్గట్టుగానే ఎంపిక చేసినట్టు కనబడుతుంది. 

ఇక ఎన్నికలు ఇప్పట్లో లేనటువంటి బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతోపాటుగా మహారాష్ట్రకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం. పశ్చిమ బెంగాల్ నుంచే నలుగురికి ప్రాతినిధ్యం కల్పించడంలో... బెంగాల్ ని బీజేపీ అంత తేలికగా వదలబోవడం లేదనేది అర్థమవుతుంది. అస్సాం, త్రిపురాల నుండి చేసిన ఎంపికలు కూడా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేసారు. 

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 2019లో నోటిదాకా వచ్చిన అధికారం అందకుండా పోయింది. 2024 ఎన్నికల్లో మహారాష్ట్ర కీలకం కానున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి కూడా మంత్రుల ఎంపిక జరిగినట్టుగా అర్థమవుతుంది. ఒకప్పుడు స్వయంగా బీజేపీ నేతలే ఆరోపణలు గుప్పించిన మాజీ శివసేన నేత, ఆ తరువాత కాంగ్రెస్ నేత ప్రస్తుత బీజేపీ నేత నారాయణ్ రాణే కి మంత్రి పదవిని కల్పించడంలో బలమైన మరాఠా సామాజికవర్గాన్ని చేరదీయాలనే ప్రయత్నం స్పష్టంగా అర్థమవుతుంది. 

2019 ఎన్నికల నాటికే హిందీ బెల్ట్ లో బీజేపీ సాచురేషన్ లెవెల్స్ చేరుకున్నందున ఇతర ప్రాంతాల్లో వారు తమ స్కోర్ ని పెంచుకోవాలిసిన అవసరం ఉంది. ఇందుకోసమే దక్షణాది నుండి ముఖ్యంగా కర్ణాటక నుండి మనకు అత్యధిక మంది కనబడుతారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని ప్రమోట్ చేయడం కూడా ఇందులో భాగమే..!

ఇక మంత్రులను తప్పోయించడం విషయానికి వస్తే గత కొద్దీ కాలంగా మంత్రుల పనితీరుపై వస్తున్న ఆరోపణలు, వారి వారి వారి పెర్ఫార్మన్స్ ఆధారంగానే తప్పించడం జరిగినట్టు కొందరు విశ్లేషకుల మాట. హర్షవర్ధన్ ని ఆరోగ్య మంత్రిత్వ శాఖా నుంచి తప్పించడం ఇందుకోక ప్రత్యక్ష ఉదాహరణ. అంది కాకుండా కొత్తగా ఎంపిక చేసిన వారిలో రాజీవ్ చంద్రశేఖర్ వంటి కొందరు టెక్నోక్రాట్స్ ఉండడం రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉండబోతుంది, వారి భవిష్యత్తు ఫోకస్ దేనిమీద వుండబోతుందనే విషయంలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. 

రవిశంకర్ ప్రసాద్, సంతోష్ గంగ్వార్ సహా ఏడుగురు కాబినెట్ మంత్రులను తప్పించడంతో ఇప్పుడు మోడీ కేబినెట్ లో రాజ్ నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు మాత్రమే అటల్ బిహారి వాజపేయి హయాంలో పనిచేసిన పాత తరం మంత్రులు మిగిలారు. ఇప్పటికే మోడీ హయాంలో పాత ఎన్డీయే తాలూకు గుర్తులు చాలా వరకు చిరిగిపోయిన నేపథ్యంలో ఇది బహుశా ఎన్డీయే నూతన తరానికి చిహ్నం కాబోలు. ఇది కదా కేబినెట్ విస్తరణపై కనబడుతున్న మోడీ మార్కు..!

click me!