జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

By telugu teamFirst Published Jan 6, 2020, 2:40 PM IST
Highlights

తనకు కంచుకోట అయిన రాయలసీమలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంతో రాయలసీమ సంతృప్తి చెందేట్లు కనిపించడం లేదు.

అమరావతి: జగన్ ప్రారంభించిన రాజధాని రగడ ఇప్పుడప్పుడు సమసిపోయేదిలా కనబడడం లేదు. సమసిపోవడం అటుంచితే...అది జగన్ కె ముప్పు తెచ్చేదిలా కనబడుతుంది. ప్రస్తుత రాజకీయపరిణామాలను చూస్తే అదే విషయంగా కనబడుతుంది. 
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతం కంచుకోట. 2019లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అక్కడ రెండు సీట్లను తప్ప...మిగిలిన అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేసింది.  

ఇన్ని సీట్లను ఇచ్చిన రాయలసీమ ప్రాంతమే ఇప్పుడు జగన్ కు తలనొప్పిగా తయారవనున్నట్టుగా రాజకీయ సంకేతాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాజకీయాల్లో వారం అనేది చాలా ఎక్కువ టైం గా చెబుతారు. ఆంధ్రప్రదేశ్ ని చూస్తే అది నిజమే అని అనిపించక మానదు. 

రాయలసీమ ప్రాంత విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ కూడా కర్నూల్ లో హై కోర్ట్ ను కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ హై కోర్టును గనుక ఏర్పాటు చేస్తే... అయిపోతుందని భావించాడు జగన్ మోహన్ రెడ్డి. కాకపోతే అమరావతలోనే రాజధాని ఉంది ఉంటే, అప్పుడు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమ ప్రాంతం వారు ఒప్పుకునేవారు. అప్పుడు జగన్ ఇమేజ్ రాయలసీమలో అమాంతం పెరిగేది. అతని కోట మరింత బలపడేది. 

కాకపోతే ఎప్పుడైతే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారో రాయలసీమ వాసులు సైతం తీవ్రమైన నిరసనలకు దిగుతున్నారు. వారి నిరసనల్లో వారి ఆకాంక్షలు కూడా లేకపోలేదు. రాయలసీమకు ఒక హై కోర్టు ఇస్తే అక్కడకు వెళ్ళేది కొన్ని వందల మంది లాయర్ల కుటుంబాలు, పదుల సంఖ్యలో జడ్జిల కుటుంబాలు.

అంతే తప్ప అక్కడ ప్రజలెవరూ సెటిల్ అవ్వరు. కేసులు ఉన్నప్పుడు అక్కడకు ఆ సదరు కేసుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి పోతుంటారు తప్ప వారు అక్కడ స్థిర నివాసాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోరు కదా. 

ఈ లెక్కన అక్కడ లాభపడేది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఓయో, మేక్ మై ట్రిప్ వంటి హోటల్ బుకింగ్ సైట్లే తప్ప అక్కడి స్థానికులకు పెద్దగా ఒరిగేది మాత్రం ఏమి ఉండదు. 

ఇక రాయలసీమలో మాత్రమే హై కోర్టు కాకుండా... ఈ హై కోర్టుకు అమరావతిలో, విశాఖపట్నంలో  మల్లి బెంచులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులు కూడా అప్పుడు కర్నూల్ వరకు రావు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంత వాసులకు హై కోర్టు ఇచ్చినా పెద్దగా ఒరిగేది ఏమి లేదు. 

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా గనుక కొనసాగితే... ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో అభివృద్ధి మరింతగా కేంద్రీకృతమవుతుంది. అమరావతిలో అభివృద్ధంతా కేంద్రీకృతమవుతుందని ఏ విధంగా అప్పటి ప్రతిపక్షం వైసీపీ గగ్గోలు పెట్టిందో... ఇప్పుడు విశాఖపట్నం వల్ల కూడా అలానే అభివృద్ధి కేంద్రీకృతమవుతుంది. రెండు సందర్భాల్లోనూ.. తాము నష్టపోయామనే భావన మాత్రం సీమ ప్రజలను వెంటాడుతుంది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు అయినా చేయండి, లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెరతీస్తామని ఇప్పటికే రాయలసీమ ప్రాంత నాయకులు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. 

ఈ మొత్తం తతంగం వెనుక బీజేపీ ఉంది అనే విషయం ఇక్కడ తేటతెల్లంగా కనబడుతుంది. రాయలసీమ ;ప్రాంత నేతల లేఖతో మొదలై, కొందరు నేతలు తమ జిల్లాను తమిళనాడులోనే లేదా కర్ణాటకలో కలపమని డిమాండులు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. 

ఇంకో అడుగు ముందుకేసి టీజీ వెంకటేష్ రాయలసీమ విక్టిమ్ కార్డును ప్లే చేసాడు. విశాఖను రాజధానిగా చేసి, దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే ఆ తరువాత హైదరాబాద్ నుండి వెళ్లగొట్టినట్టు మళ్ళీ సీమ ప్రజలను అక్కడి నుండి మెడలు పట్టుకొని వెళ్ళగొట్టారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించాడు?

ఇలా అన్ని వరుస పరిణామాలను బట్టి చూసుకుంటుంటే... ఒక్కో సంఘటనకు సంబంధం లేదని అనిపిస్తుంది, కానీ అన్నిటిని కలిపి చూస్తే మాత్రమీ అసలు విషయం మనకు గోచరిస్తుంది. 

రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఒక భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అసలు సందిగ్ధత నెలకొంది బీజేపీ వైఖరి గురించి. ఒక నేతేమో సపోర్ట్ చేస్తుందంటాడు, ఇంకొకరేమో లేదు అంటారు. అసలు బీజేపీ ఎం చేయబోతుందనేది అసలు ప్రశ్నగా మారింది. 

నిన్న జేసీ దివాకర్ రెడ్డి మాటలను బట్టి చూసినా, నేటి మోహన్ బాబు నరేంద్ర మోడీ భేటీని చూసినా మనకు అర్ధమయ్యే విషయం ఒక్కటే... బీజేపీ రాయలసీమలో పట్టుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

జగన్ రాజధాని మార్పు అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ పావులు కదుపుతుంది. జగన్ రాజధానిని మార్చినా మార్చకపోయినా తమకు మాత్రం రాజధాని కావలిసిందే అని, రాయలసీమకు అన్యాయం చేశారని బీజేపీ గలాన్నెత్తుకోబోతుంది. 

ఇటు జగన్ అయినా... అటు చంద్ర బాబు అయినా ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవారయినప్పటికీ, రాయలసీమకు ఎటువంటి లాభం కూడా చేయకపోగా, సీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం కూడా సహించ దగ్గది కాదని ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. 

ఇలా గనుక చేస్తే సీమ ప్రాంత నేతలను ఇబ్బంది పెట్టినట్టవుతుంది. వైసీపీలో అసంతృప్తులు, టీడీపీ అసంతృప్తులను బీజేపీ లాక్కోవడానికి వీలుంటుంది. ఇప్పటికే జగన్ బ్యాటింగ్ ను తట్టుకోలేక కొంతమంది వైసీపీలో చేరిపోయారు కూడా. 

అలాంటివారందరికి ఇప్పుడు బీజేపీ ఆలంబనగా మారుతుంది. అలా ఆ ప్రాంత నేతలను తమవైపుగా తిప్పుకోవాలని బీజేపీ చూస్తుంది. నేటి మోహన్ బాబు మీటింగ్ కూడా దానికే సంకేతాలను ఇస్తుంది. 

మోడీకి మోహన్ బాబుకి ఎప్పటినుండో దగ్గర సంబంధాలున్నాయి. మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు మోహన్ బాబు వెళ్లి ఆత్మీయంగా కలిసి ఫోటో కూడా దిగారు. అలానే జగన్ తో సంబంధాలతోపాటు బంధుత్వం కూడా ఉంది. 

జగన్ తో సన్నిహితంగా ఉన్నందుకు కమెడియన్ పృథ్వికే ఎస్వీబిసి చైర్మన్ పదవిని ఇచ్చినప్పుడు మోహన్ బాబుకి జగన్ పదవి ఇవ్వకుండా ఉండదు కదా? జగన్ ఆఫర్ చేసినప్పటికీ మోహన్ బాబు తీసుకోలేదనేది ఇప్పుడు బయటకొస్తున్న విషయం. 

ఎలాగూ బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టి ప్రత్యేక రాయలసీమ ఉద్యమమో లేక గ్రేటర్ రాయలసీమ ఉద్యమమో ఏదో ఒకదానికి బీజేపీ మద్దతు పలికి ఆ దిశగా పావులు కదిపేందుకే అమితాసక్తి చూపెడుతుంది. 

click me!