ప్లాస్టిక్ ఇవ్వండి... కమ్మని భోజనం ఉచితంగా తినండి

By telugu teamFirst Published Dec 18, 2019, 5:06 PM IST
Highlights

ఎవరైనా సరే ఆ నగరంలో అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆ సెంటర్లకు తీసుకెళ్లి ఇస్తే ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం పొందవచ్చు. దీంతో ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించడంతోపాటు మరోవైపు నిత్యం ఆహారం కూడా పొందలేని పేదలకు కూడా సహాయం అందించిన వారమవుతామని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీకావు. ప్లాస్టిక్ ని వినియోగించకండి అంటూ.... ప్రభుత్వాలు నెత్తి నోరు మొత్తుకొని మరీ చెబుతున్నాయి. అంతేనా .. ప్లాస్టిక్ వాడితే.. జరిమానా విధిస్తామంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చారు. కొద్ది రోజులపాటు మారినట్లే నటించడం ఆ తర్వాత మళ్లీ యాథావిథిగా ప్లాస్టిక్ ని వాడటం అలవాటైపోయింది. ఆ వాడిన ప్లాస్టిక్ ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దాని వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. అసలు ప్లాస్టిక్ భూమిలో కలవదు.. ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉండిపోతుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.

అయితే... ఓ కేఫ్ నిర్వాహకులు మాత్రం... ఈ ప్లాస్టిక్ ని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అరకేజీ ప్లాస్టిక్ ని కనుక తమకు అందిస్తే... వారికి ఉచిత భోజనం పెడతామని చెప్పారు. ఇంకేముంది ప్లాస్టిక్ సంచులతో జనాలు ఆ కేఫ్ ముందు బారులు తీరారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ కేఫ్ నిర్వాహకులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార్ స్కీంలో భాగంగా మీల్ ఫర్ ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్‌లో మొత్తం 11 చోట్ల ఆహార్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ఎవరైనా సరే ఆ నగరంలో అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆ సెంటర్లకు తీసుకెళ్లి ఇస్తే ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం పొందవచ్చు. దీంతో ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించడంతోపాటు మరోవైపు నిత్యం ఆహారం కూడా పొందలేని పేదలకు కూడా సహాయం అందించిన వారమవుతామని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

కాగా త్వరలోనే భువనేశ్వర్‌లో మరిన్ని చోట్ల ఆహార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం సత్ఫలితాలనే ఇస్తుందని అంటున్నారు. అయితే ఇదే కార్యక్రమాన్ని ఇతర రాష్ర్టాలు కూడా ప్రేరణగా తీసుకోవాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు..

click me!