అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో ఉంటున్న కుమారుడితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన తండ్రి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో ఉంటున్న కుమారుడితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన తండ్రి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) ప్రభుత్వ ఉద్యోగి. హన్మకొండ గోపాలపూర్‌లో నివాసముండే రాజమౌళి.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.
ఆయన చిన్న కుమారు పవన్ కుమార్ అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో కొన్ని రోజులు కొడుకు వద్ద గడుపుదామని రాజమౌళి భావించారు. దీనిలో భాగంగా తన భార్య నీలిమాతో కలిసి గత నెల 5న ఆయన అమెరికా వెళ్లారు.
వాషింగ్టన్, న్యూయార్క్ నగరాలను కారులో వెళ్లి సందర్శించిన రాజమౌళి కుటుంబ సభ్యులు తిరిగి మిచిగాన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
భారీ వర్షం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి బయటపడిన పవన్.. కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
ఎంతో శ్రమించి తల్లిని కాపాడినప్పటికీ.. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో రాజమౌళీ వాటిలో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. రాజమౌళి మృతితో ఆయన స్వస్థలం పరకాలలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.