అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం..

By Sumanth Kanukula  |  First Published Apr 24, 2022, 9:54 AM IST

అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన వీరు.. అక్కడ జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.


అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన వీరు.. అక్కడ జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 21) రోజున చోటుచేసుకుంది. మృతులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన స్వర్ణ పవన్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లికి చెందిన పీచెట్టి వంశీకృష్ణ గా గుర్తించారు. వివరాలు.. పవన్, వంశీ లు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్, వంశీ, అవతలి కారులోని మహిళ మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. 

ఈ ఘటనపై ఇల్లినాయిస్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కేప్ గిరార్డోకు చెందిన 32 ఏళ్ల Marie Meunier నడుపుతున్న మరో కారు సెంటర్ లైన్ దాటి పవన్ వాహనాన్ని ఢీకొట్టింది. మేరీతో పాటు పవన్, వంశీ అక్కడికక్కడే మృతి చెందారు. పవన్‌తో పాటు ప్రయాణిస్తున్న కళ్యాణ్ దోర్న, కార్తీక్ కాకుమాను, యశ్వంత్ ఉప్పలపాటి అనే ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది’’ అని తెలిపారు. 

Latest Videos

ఈ ఘటనపై వంశీ సోదరుడు శశి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘నా సోదరుడు వంశీ డ్రైవర్ సీటు వెనక కూర్చొన్నాడు. అతి వేగంతో ఎదురుగా వచ్చిన కారు పవన్ కారును ఢీ కొట్టింది. వంశీ, పవన్ కార్బొండేల్‌లోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవుతున్నారు’’ అని చెప్పాడు. 

పవన్, వంశీ మరణం పట్ల వారు చదువుతున్న సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. ‘‘ కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని.. మరో ముగ్గురు గాయపడ్డారని  తెలుసుకుని మేము చాలా బాధపడ్డాం వంశీ, పవన్ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కళ్యాణ్, కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థులు కార్తీక్, యశ్వంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలను ఆదుకోవడానికి మేము కృషి చేస్తున్నాం’’ అని SIU ఛాన్సలర్ ఆస్టిన్ లేన్ చెప్పారు. మరోవైపు పవన్, వంశీ మృతదేహాలను భారత్‌కు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇక, నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పీచెట్టి వరప్రసాద్‌, పద్మజరాణి దంపతుల చిన్నకుమారుడు వంశీకృష్ణ. వరప్రసాద్ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్‌గా, పదర్మజరాణి జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరప్రసాద్, వంశీకృష్ణ దంపతుల పెద్ద కుమారుడు శశి కిరణ్ ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. వంశీకృష్ణ గతేడాది బీటెక్ పూర్తి చేసి.. అదే ఏడాది డిసెంబర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. ప్రస్తుతం సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో వంశీ కృష్ణ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. 

ఇక, ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారంకు చెందిన స్వర్ణ రమేష్, సునీతలకు ఇద్దరు పిల్లాలు, కూతురు పెళ్లి చేసుకని అమెరికాలో స్థిరపడింది. కొడుకు పవన్ బీ.టెక్ పూర్తి చేసి 7 నెలల క్రితం మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాడు. సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తున్నాడు. పవన్ మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

click me!