కువైట్ లో దారుణం... పడవ బోల్తాపడి ఇద్దరు భారతీయుల దుర్మరణం

By Arun Kumar PFirst Published Mar 26, 2023, 9:53 AM IST
Highlights

కువైట్ లో సరదాగా బోటింగ్ వెళ్ళి ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 

కువైట్ : ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. కువైట్ దేశంలోని ఖైరాన్ లో ఇద్దరు స్నేహితులు సరదాగా బోటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోటు బోల్తా పడటంతో జోసెఫ్, సుకేష్ నీటమునిగి మృతిచెందారు. 

కేరళకు చెందిన  సుకేష్  , జోసెఫ్ మథాయ్ మంచి స్నేహితులు. ఇద్దరూ ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి ప్రముఖ లులూ గ్రూప్ లో ఉద్యోగాలు చేసేవారు. అయితే సెలవురోజుల్లో సరదాగా గడిపేందుకు ఈ ఇద్దరు స్నేహితులు కువైట్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించేవారు. ఇలా గత శుక్రవారం సాయంత్రం ఖైరాన్ వెళ్లిన సుకేష్, జోసెఫ్ నీటిలో పడవపై ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోట్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడేందుకు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అలాగే నీటమునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ప్రమాదంతో కేరళలో విషాదం నెలకొంది. కన్నూర్ లో నివాసముండే సుకేష్ కుటుంబం, పతనంతిట్టలోని జోసెఫ్ కుటుంబం కువైట్ లో తమబిడ్డలు మృతిచెందినట్లు తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ సిబ్బంది మృతిపై లులూ సంస్థ కూడా దిగ్భ్రాంతి, సానుభూతి వ్యక్తం చేసింది. 

Read More  న్యూయార్క్ లో విమాన ప్రమాదం.. భారత సంతతికి చెందిన మహిళ మృతి, కూతురు పరిస్థితి విషమం...

 ఇదిలావుంటే ఇటీవల తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో కన్నుమూశాడు. మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా గుండెపోటుతో సౌదీ విమానాశ్రయంలోనే కుప్పకూలి చనిపోయాడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహ్మద్ చాంద్ పాషా.మార్చి 2వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

కొండాపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహ్మద్ చాంద్ పాషా సౌదీ అరేబియాలోని అభా నగరంలో పని చేసేందుకు వెళ్లాడు. అయితే మార్చి 2వ తేదీన తిరిగి భారత్‌కు బయలుదేరేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. మరో గంటలో అతడి ప్రయాణించాల్సిన విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే ఈలోపే మహ్మద్ చాంద్ పాషాకు గుండెపోటు వచ్చింది. అయితే ఇది గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి తరలించేలోపే చాంద్ పాషా మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. 

అయితే మార్చి 2న మహ్మద్ చాంద్ పాషా మరణించగా.. దాదాపు మూడు వారాల తర్వాత మార్చి 20న అతడి మరణ వార్త వెలుగులోకి వచ్చింది. పాషా అంత్యక్రియలు కూడా సౌదీ అరేబియాలోనే జరిగాయి. 

click me!