ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ కు చెందిన సంధ్యారెడ్డి ఇలా ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు సాధించారు.
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ డిప్యూటీ మేయర్ గా. ఎన్నికయ్యారు. గురువారంనాడు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీనగరంలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ ఎన్నికయ్యారు. ఆమెను శాండీ రెడ్డి అని కూడా పిలుస్తారు. సంధ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాద్ కు చెందిన వ్యక్తి.
ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు. శాండీ రెడ్డి హైదరాబాదులోని స్టాన్లీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లా పట్టా తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏంఏ పూర్తి చేశారు.
సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్.. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలు
1991లో సంధ్యారెడ్డి వివాహం కర్రీ బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జరిగింది. తల్లిదండ్రులు పట్లోళ్ల సారా రెడ్డి, శంకర్ రెడ్డి. వివాహమైన తర్వాత ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కూడా తన చదువును కొనసాగించారు. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా లో డిగ్రీ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఇమిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు.
ఆస్ట్రేలియాలోని ఆమె స్థానికంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను భర్తతో కలిసి చేశారు. స్ట్రాత్ ఫీల్డ్ లోని హోమ్ బుష్ కమ్యూనిటీ సెంటర్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంలో సంధ్యారెడ్డి ఎంతో చొరవ చూపించారు. ఆమె చొరవతోనే ఇది జరిగిందని చెప్పుకోవచ్చు.
2020లో ఆమె సేవలకుగాను సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గుర్తింపుగా లభించింది. సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ లో ఉంటారు. స్ట్రాత్ ఫీల్డ్ లో 2021లో పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సంధ్యారెడ్డి చురుకుదనం, సేవా కార్యక్రమాలలో గుర్తుపెట్టుకున్న అక్కడి తెలుగువారు.. ప్రవాస భారతీయులు… ఆస్ట్రేలియా వాసులు కూడా ఆమెను పోటీ చేయాల్సిందిగా కోరారు.
అలా ఆమె స్థానికంగా ఉన్న లేబర్ పార్టీ, లిబరల్ పార్టీల అభ్యర్థుల మీద స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లోఆమె విజయం సాధించారు. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీకి ప్రతి ఏడు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. అలా తాజాగా ఈ ఏడు జరిగిన ఎన్నికల్లో సంధ్యారెడ్డి ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.
ఈ అవకాశం తనకు దక్కడం మీద సంధ్యారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంధ్యా రెడ్డికి నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి అని ఇద్దరు కుమారులున్నారు. వీరిలో నిఖిల్ ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్ గా ఈ ఏడు గెలిచాడు. ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళా శక్తిని చాటిన సంధ్యారెడ్డికి బీఆర్ఎస్ ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేష్, ఇతర నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్ట్రాత్ ఫీల్డ్ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడంపై అభినందనలు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఆమె గర్వకారణం అన్నారు.