తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో బ్రిటన్ రాజధాని లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు హాజరయ్యారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ 75 ఏళ్ల (75 years of India’s Independence) స్వత్రంత్ర భారత్ సంబరాల్లో భాగంగా.. లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఏఎఫ్) (Telangana NRI forum ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను (International Women’s Day) ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ నలుమూలల నుంచి వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరిని ఆహ్వానించారు.
ఇండియాలో ఈ 75 ఏళ్లలో సాధించిన మహిళా సమూలాభివృద్ధి, వారికి అందించాల్సిన ప్రోత్సాహం గురించి సెషన్స్ ఏర్పాటు చేసారు. ఇందులో చేనేత, గొల్లభామ, పెంబర్తి, నిర్మల్ బొమ్మలని ప్రచారం చేస్తూ ఈ సంవత్సరం కరీంనగర్‌కి చెందిన ఫిలిగ్రి వెండి కళలని ప్రోత్సహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు మీనా అంతటి, గంప జయశ్రీ, శౌరి గౌడ్ సమర్థవంతంగా నిర్వహించారు.