ఇటలీలో ఆంధ్ర యువకుడి దుర్మరణం.. తల్లిదండ్రుల కలలను మింగేసిన రాకాసి అలలు..

By Sumanth Kanukula  |  First Published Jun 12, 2022, 10:34 AM IST

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.. అక్కడ జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసుకున్న యువకుడు.. కొద్దిరోజుల్లో ఇండియాకు తిరిగిరావాల్సి ఉండగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. 


విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.. అక్కడ జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసుకున్న యువకుడు.. కొద్దిరోజుల్లో ఇండియాకు తిరిగిరావాల్సి ఉండగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటలీలోని మాంటెరోస్సో శుక్రవారం ( ఈ నెల 10) సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలులోని బాలజీనగర్‌లో చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావు చిన్న వ్యాపారి కాగా.. శారద ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆ దంపతుల పెద్ద కొడుకు దిలీప్.. స్థానికంగానే పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత విజయవాడలో ఇంటర్ చదివాడు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశాడు. 

M.Sc. Agriculture చేసేందుకు 2019లో దిలీప్ ఇటలీలోని మిలాన్ వెళ్లాడు. గతేడాది స్వదేశానికి వచ్చి.. కొన్ని నెలల పాటు ఉన్నాడు. అనంతరం అక్కడికి తిరిగివెళ్లాడు. ఇటీవల కోర్సు పూర్తికావడంతో త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి కర్నూలుకు వస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. కోర్సు పూర్తి కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేందుకు మాంటెరోస్సో వెళ్లాడు. ఇది మిలానో నుంచి దాదాపు 220 కి.మీ దూరంలో ఉంది. 

Latest Videos

శుక్రవారం సాయంత్రం అక్కడి బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో అలల దాటికి దిలీప్ కొట్టుకు పోయాడు. దిలీప్‌ను రక్షించేందుకు అక్కడి కోస్టు గార్డులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు దిలీప్ మృతదేహం లభించలేదు. దిలీప్ మరణవార్తను స్నేహితులు అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో దిలీప్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దిలీప్ కొద్ది రోజుల్లోనే ఇంటికి వస్తాడని అనుకుంటుండగా.. ఈ ప్రమాదం జరగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు దిలీప్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇటలీలో అన్ని చట్టపరమైన లాంఛనాల తర్వాత మృత దేహాన్ని వీలైనంత త్వరగా కర్నూలు తీసుకురావడానికి  సహకరించాలని కోరుతూ దిలీప్ తండ్రి శ్రీనివాసరావు.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కోరాడు. అదే సమయంలో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు.

click me!