ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరబాదీ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు.
మిస్సోరి: భవిష్యత్ పై ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఖాజా ఇమ్రాన్(23) అనే యువకుడు ఓ సరస్సులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. దీంతో హైదరాబాద్ లోని అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి సెయింట్ లూయిస్ లో నివాసముంటున్నాడు.
read more స్నేహితురాలి కడుపు కోసి.. బిడ్డను ఎత్తుకెళ్లి..
అయితే అతడు ఇటీవల స్నేహితులతో కలిసి సరదాగా తమ నివాస ప్రాంతానికి దగ్గర్లో వున్న సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ నీటితో వారంతా ఈతకు దిగారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ బాగా లోతులోకి వెళ్లి మునిగిపోయాడు. దీన్ని గమనించిన స్నేహితులు అతన్ని కాపాడేప్రయత్నం చేసినా ఫలితంలేకుండా పోయింది. నీటిలో మునిగి బయటకు రావడం సాధ్యంకాక అతడు మృత్యువాతపడ్డాడు.
దీంతో అతడి స్నేహితులు ఈ విషయాన్ని హైదరాబాద్ లోని ఇమ్రాన్ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. తమ కొడుకుకు మంచి భవిష్యత్ అందించాలని విదేశాలకు పంపితే ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.