శరత్ మృతదేహం తరలింపులో జాప్యం: 20 డాలర్ల కోసమే హత్య చేశాడా!?

First Published Jul 11, 2018, 10:49 AM IST
Highlights

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్న శరత్‌ను కేవలం 20 డాలర్ల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఓ నల్లజాతీయుడిని బిల్లు చెల్లించమని కోరినందుకు, ఆ దుండగుడు శరత్‌పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.

అమెరికాలోని కన్సాస్ సిటీలో దుండగుడి కాల్పుల్లో మరణించిన తెలంగాణ యువకుడు శరత్ కొప్పు భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకురావటంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. గడచిన శుక్రవారం కన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో శరత్ మరణించిన సంగతి తెలిసినదే. శరత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావటం కోసం అమెరికాలోని శరత్ మిత్రులు గోఫండ్‌మి అనే వెబ్‌సైట్ ద్వారా ఫండ్ రైజింగ్ ప్రారంభించారు. ఇలా చేసిన మూడు గంటల్లోనే 25,000 డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.

కానీ.. శరత్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావటంపై నేటికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యుల కన్నీళ్లను ఆపడం కష్టంగా మారుతోంది. ఈ సంఘటన జరిగి ఆరు రోజులు గడిచిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరామర్శలు తప్ప, శరత్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే విషయంలో స్పష్టమైన సమాచారం మాత్రం అందడం లేదు. శరత్‌ను చివరిసారిగా చూసుకోవాలని ఆ కుటుంబం పడుతున్న ఆవేదనను చెప్పడానికి మాటలు రావట్లేదు.

20 డాలర్ల కోసమే హత్య చేశాడా!?

కాగా.. అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్న శరత్‌ను కేవలం 20 డాలర్ల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఓ నల్లజాతీయుడిని బిల్లు చెల్లించమని కోరినందుకు, ఆ దుండగుడు శరత్‌పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో శరత్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా, రెండు బుల్లెట్లు శరత్ శరీరంలోకి దూసుకుపోయాయి. హుటాహుటిన శరత్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది

నిందితుడి వీడియోలు, ఫొటోలు విడుదల

శరత్ కొప్పు హత్య కేసులో కన్సాస్ పోలీసులు దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు సీసీటీవి ఫుటేజీని, వీడియోను మీడియాకు విడుదల చేశారు. పలు సమాజిక మాధ్యమాలలో నిందితుడి వివరాలను సర్క్యులేట్ చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 10 వేల అమెరికన్ డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించారు. 

click me!