ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా గీత గోపినాథ్: ఎవరీమె...

By sivanagaprasad kodatiFirst Published Oct 2, 2018, 12:04 PM IST
Highlights

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌)కు చీఫ్ ఎకనామిస్ట్‌గా భారత సంతతి మహిళ గీతా గోపినాథ్ నియమితులయ్యారు.

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌)కు చీఫ్ ఎకనామిస్ట్‌గా భారత సంతతి మహిళ గీతా గోపినాథ్ నియమితులయ్యారు.

ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ కాన్సిలర్‌గా, డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఐఎంఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియానే లగార్డే ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మౌరైస్ అబ్స్ట్‌ఫెల్డ్‌ ఈ ఏడాది చివర్లో పదవి విరమణ చేయనుండటంతో.. ఆ స్థానంలో గీతాను నియమిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది.

గీత ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్శిటీలో ఎకనమిక్స్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్‌లో పుట్టిన గీత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. అనంతరం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంఏ పట్టా సాధించారు.

ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గీత... యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎకనమిక్స్‌లో ఎంఏ డిగ్రీ సాధించారు. అనంతరం 2001లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పొందారు. 2001లో చికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.

అదే ఏడాది అమెరికా పౌరసత్వం పొందిన ఆమె 2005లో హార్వర్డ్‌కు వెళ్లారు. దీనితో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేశారు.. జీ20 దేశాల ‘‘ ఎమినెంట్ పర్సన్స్ అడ్వైజరీ గ్రూప్’’కు భారత్ తరపున ప్రతినిధిగానూ.. 2018లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఫెలో పర్సన్‌గాను చేశారు.

2014లో ఐఎంఎఫ్ విడుదల చేసిన టాప్ 25 ఎకనమిస్ట్‌ల జావితాలో గీతా చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆమె ‘‘ యంగ్ గ్లోబల్ లీడర్’’ పురస్కారాన్ని అందుకున్నారు.

ఆర్థిక అంశాల్లో సమకాలీన విషయాలపై గీత 40 పరిశోధనా వ్యాసాలను రాశారు. అమెరికన్ ఎకనమిక్ రివ్యూ కో-ఎడిటర్‌గానూ..ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మాక్రో ఎకనమిక్స్‌ ప్రొగ్రామ్‌కి కో-డైరెక్టర్‌గాను వ్యవహరించారు.

గీతా గోపినాథ్ అసాధారణ ప్రతిభను గుర్తించి.. తమ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమించినట్లు క్రిస్టియానే లగార్డే తెలిపారు. ‘‘ గీత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని.. నాయకత్వ బాధ్యతల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఆమెకు ఉందని లగార్డే తెలిపారు. 

click me!