విపణిలోకి స్కోడా కొడియాక్ ప్లస్ సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్లు

By Nagaraju penumalaFirst Published Sep 24, 2019, 12:37 PM IST
Highlights

న్యూ స్కోడా కొడియాక్, సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్ కార్లు దేశీయ విపణిలోకి అడుగు పెట్టాయి. వాటి ధరలు రూ. 32.99 లక్షలు, రూ.25.99 లక్షల నుంచి మొదలు కానున్నాయి.

న్యూఢిల్లీ: భారత దేశ మార్కెట్లోకి స్కోడా ఆటో ఇండియా సంస్థ కొడియాక్, సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించింది. వీటిలో కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ కారు ధర రూ.32.99 లక్షలు, సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్ కారు రూ.25.99 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. సూప్రబ్ వేరియంట్ రెండు రంగుల్లోనూ, కొడియాక్ నాలుగు రంగుల్లోని వినియోగదారులకు లభించనున్నాయి.

కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో 148 బీహెచ్పీ శక్తిని, సూప్రబ్ కార్పొరేట్ ఎడిషన్ కారు 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో 187 బీహెచ్పీ శక్తి, 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో 175 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తాయని స్కోడా ఆటో ఇండియా తెలిపింది.

8- అంగుళాల అముండ్ సేన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్‌తోపాటు స్మార్ట్ లింక్ టెక్నాలజీ, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన ఫీచర్లు ఈ కార్లలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఏబీఎస్, ఈబీడీ, హెచ్బీఏ, ఏఎస్సార్, ఈఎస్సీ వంటి వసతులతోపాటు కొడియాక్ కార్పొరేట్ వేరియంట్ కారులో 9, సూప్రబ్ కార్పొరేట్ వేరియంట్ కారులో 8 ఎయిర్ బ్యాగులను ఏర్పాటు చేసింది స్కోడా ఆటో ఇండియా.

స్కోడా కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ కారు ముందు భాగంలో బటర్ ఫ్లై గ్రిల్‌తోపాటు అడాప్టివ్ హెడ్ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ముందుబాగంలో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు అమర్చారు.

ఇంకా సూప్రబ్ కార్పొరేట్ వేరియంట్ కారులో అదనంగా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, వైడ్ రేడియటర్ గ్రిల్, వైడ్ హెడ్ లైట్లు, ఫాగ్ లైట్స్, త్రీజోన్ క్లైమేట్ కంట్రోల్, త్రీ పాయింట్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

click me!