సర్కార్ విధానాల వల్లే: కార్ల సేల్స్ తగ్గుదలపై మారుతి సుజుకి

By telugu teamFirst Published Sep 23, 2019, 11:21 AM IST
Highlights


ఉద్గరాల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెచ్చిన నిబంధనల వల్లే ఆటోమొబైల్ రంగం చతికిల పడిందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా మోటార్స్ కూడా నష్టాల పాలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ ఆటోమొబైల్ సంస్థలు పెట్టుబడులకు వెనుకాడుతున్నాయని చెప్పారు.

దేశంలోని కార్ల తయారీ పరిశ్రమల్లో చాలా సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని మారుతి సుజూకీ చైర్మెన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. గత కొంతకాలంగా ఆటోమొబైల్‌ రంగంలో క్షీణిస్తున్న వృద్ధి, నానాటికీ తగ్గుతున్న వాహనాల అమ్మకాలు, ఉద్యోగుల తొలగింపు, ఉత్పత్తి నిలిపివేస్తున్నాయి. 
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భార్గవ మాట్లాడుతూ.. భారత్‌లో ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న సంస్థలలో విదేశీ సంస్థలైన ఫోర్డ్‌, జీఎం4లతో పాటు స్వదేశీ కంపెనీలూ నష్టాల బాటలోనే ఉన్నాయని అన్నారు. విదేశీ సంస్థలైతే తమ పరిశ్రమలను మూసివేసేందుకు సిద్ధపడుతున్నాయని చెప్పారు. 

కాలుష్య ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు దీనికి ప్రధాన కారణమని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.  యూరోపియన్‌ దేశాల మాదిరి ఇక్కడా చేయాలని కేంద్రం యోచిస్తున్నదనీ, కానీ యూరోపియన్ల మాదిరి ఇక్కడి వినియోగదారులకు కొనుగోలు శక్తి లేదని వ్యాఖ్యానించారు. 

అక్కడి నిబంధనలపై మాట్లాడే ముందు ఉత్పత్తి ఖర్చులను పోల్చి చూడాలని ఆర్సీ భార్గవ హితవు పలికారు. నీతిఆయోగ్‌ వైస్‌ చెర్మెన్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమలు సైతం ప్రస్తుత పరిస్థితిపై బాధ్యత వహించాలని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. 

దీనిపై భార్గవ స్పందిస్తూ ఒకసారి కార్ల కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు (ఆదాయ వ్యయాల పట్టిక) చూస్తే అసలు విషయం నిర్ధారణ అవుతుందన్నారు. చాలా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయనీ.. జీఎం4, ఫోర్డ్‌ వంటి బడా విదేశీ సంస్థలు సైతం దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయని చెప్పారు.

టాటా మోటార్స్‌ వంటి సంస్థలు కూడా నష్టాలను చవిచూస్తున్నాయని మారుతి సుజుకి చైర్మన్ భార్గవ వివరించారు. మొదటి నుంచి తమది మితవ్యయ సంస్థ అనీ, పై స్థాయిలో ఉన్న తమ ఉద్యోగులకు సైతం తక్కువ వేతనాలను ఇచ్చినప్పటికీ మాంద్యం దెబ్బ తప్పడం లేదని తెలిపారు. 
కాగా అసలు మాంద్యమే లేదనీ, ఒక్క ఉద్యోగి కూడా తన ఉద్యోగాన్ని కోల్పోలేదని కేంద్ర మంత్రులు చెబుతున్న నేపథ్యంలో ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆటోమొబైల్‌ రంగంలోని వాస్తవ పరిస్థితికి అద్దం పట్టాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

click me!